నా మాటే శాస‌నం : ప‌రిటాల శ్రీరామ్

ప‌రిటాల శ్రీరామ్‌. టీడీపీ యువ నాయ‌కుడు. మంచి ఫైర్ ఉన్న నాయ‌కుడు కూడా! అనంత‌పురం జిల్లాలో ఒక‌ప్పుడు.. రాజ‌కీయాల‌ను శాసించిన ప‌రిటాల ర‌వి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన శ్రీరాం.. గ‌త ఎన్నిక‌ల్లో రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. అప్ప‌టి వ‌ర‌కు మంత్రిగా సున్న ప‌రిటాల సునీత త‌న కుమారుడికి సీటు ఇప్పించుకునేందుకు ఆమె పోటీ నుంచి త‌ప్పుకున్నారు. ప‌రిటాల ర‌వి వార‌సుడిగా భారీ అంచ‌నాల‌తో ఆయ‌న రంగంలోకి దిగినా.. వైసీపీ సునామీ నేప‌థ్యంలో విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు.

కానీ, పార్టీ కోసం ఆయ‌న కృషి చేస్తున్నారు. క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టి నుంచో ఈ కుటుంబం డిమాండ్ చేస్తున్న ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాన్ని కూడా చంద్ర‌బాబు ఈ కుటుంబం చేతిలోనే పెట్టారు. ప‌రిటాల శ్రీరామ్‌ను ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్ చేశారు. దీంతో అటు రాప్తాడులో మాజీ మంత్రి, ప‌రిటాల ర‌వి స‌తీమ‌ణి.. ప‌రిటాల సునీత పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ధ‌ర్మ‌వ‌రం నుంచి శ్రీరామ్ పోటీకి సిద్ధ‌మ‌వుతున్నారు. లేదు.. ఒక‌వేళ .. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు కాదంటే.. ధ‌ర్మ‌వ‌రం నుంచి తాము ఎంచుకున్న నేత‌కు టికెట్ ఇచ్చేలా .. వ్యూహం సిద్ధం చేసుకున్నారు. కానీ, ఇటీవ‌ల వ‌ర‌దాపురం సూరి.. పార్టీ నుంచి వెళ్లిపోయారు. మ‌ళ్లీ ఎన్నిక‌ల స‌మ‌యానికి టీడీపీలోకి వ‌చ్చి.. ధ‌ర్మ‌వ‌రం టికెట్‌ను ద‌క్కించుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌నే టాక్ వ‌స్తోంది.

ఈ క్ర‌మంలో శ్రీరామ్ హాట్ కామెంట్లు చేశారు. త‌న మాటే శాస‌న‌మ‌ని.. ధ‌ర్మ‌వ‌రం టికెట్‌ను త‌ను చెప్పిన వారికి మాత్ర‌మే ఇస్తార‌ని.. ఆయ‌న వ్యాఖ్యానించారు. తాను ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబుకు కూడా చెప్పాన‌ని అన్న ఆయ‌న‌.. ఈ విష‌యంలో తేడా వ‌స్తే.. తిరిగి సూరికే ఈ టికెట్ ఇస్తే.. తాను రాజ‌కీయాల నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకొంటాన‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ధర్మవరంలో టీడీపీలోకి ఎవరు వచ్చినా తాను కండువా వేస్తానని శ్రీరామ్ అన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తే పదవి ఇప్పిస్తానని చెప్పారు. అంతే త‌ప్ప‌.. తిరిగి సూరికి టికెట్ ఇస్తే మాత్రం ఊరుకునేది లేద‌ని.. వ్యాఖ్యానించారు. మ‌రి దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.