ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో న్యాయ స్థానం టు దేవ స్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, పాదయాత్ర ముగింపు సందర్భంగా రైతులు నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
ఈ క్రమంలోనే రైతులు అనుమతి కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతి రైతుల ముగింపు సభకు హైకోర్టు అనుమతినిచ్చింది. డిసెంబరు 17వతేదీ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభ జరుపుకోవాలని సూచించింది.
కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం సభకు అనుమతినివ్వాలని అమరావతి పరిరక్షణ సమితి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సభకు అనుమతినిచ్చింది. అయితే, ఈ సభకు అనుమతివ్వడం వల్ల రెండు ప్రాంతాల మధ్య ఘర్షణలు ఏర్పడే ప్రమాదముందని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుధాకర్‌రెడ్డి వాదించారు.
ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు సభ నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. మరోవైపు, ఈ రోజు తిరుమలలో వెంకన్నను దర్శించుకునేందుకు రైతులకు టీటీడీ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. 500 మంది రైతులు ఒకేసారి దర్శనం చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది.