మొత్తానికి ఒక్క విషయంలో మాత్రం అధికార వైసీపీ, ప్రధాన ప్రతిపక్ష ఎంపీలు చేతులు కలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మూడు రోజులుగా జరుగుతున్న బీసీ సంక్షేమ సంఘాల ధర్నాలో రెండు పార్టీల ఎంపీలు పాల్గొన్నారు. బీసీ డిమాండ్లకు రెండు పార్టీల ఎంపీలు సంఘీభావం ప్రకటించటం గమనార్హం. దేశ జనాభా లెక్కలు సవరించాలని, బీసీల కులగణన చేయాలనే డిమాండ్ తో రెండు రాష్ట్రాల బీసీల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి.
రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ, ప్రాజెక్టుల విషయంలో కానీ, ఏపీకి నరేంద్ర మోడీ సర్కార్ ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్న ద్రోహం విషయంలో కానీ రెండు పార్టీలు ఎప్పుడూ కలిసింది లేదు. ఒక పార్టీ ఎంపీ పార్లమెంటులో రాష్ట్ర ప్రయోజనాలపై గట్టిగా మాట్లాడిందంటే వెంటనే రెండో పార్టీ మరో పార్టీని టార్గెట్ చేయటమే ఇంతకాలం జనాలందరూ చూశారు. రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి మీరే కారణమంటే కాదు మీరే కారణమని ఒకరిని మరొకరు నిందించుకోవటంతోనే పుణ్యకాలం గడచిపోతోంది.
రెండు పార్టీల మధ్య ఉన్న విభేదాలను నరేంద్ర మోడీ చాలా తెలివిగా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. రెండు పార్టీలను అడ్డంపెట్టుకుని ఏకంగా రాష్ట్రప్రయోజనాలనే మోడి తుంగలో తొక్కేస్తున్నారు. అయినా రెండు పార్టీల ఎంపీలకు ఏమాత్రం బాధుండటం లేదు. రాష్ట్రంలోనే కాకుండా పార్లమెంటు వేదికగా రెండుపార్టీల ఎంపీలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుని రాష్ట్రం పరువు తీసేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలుగా పార్లమెంటు లోపలా బయటా జరుగుతున్నదిదే.
అలాంటిది కేంద్రానికి వ్యతిరేకంగా బీసీ సంక్షేమ సంఘాలు చేస్తున్న నిరసనకు పోటీలు పడి రెండు పార్టీల ఎంపీలు ఎందుకని మద్దతు ప్రకటించాయి. ఎందుకంటే బీసీల ఓటు బ్యాంకు అవసరం కాబట్టే. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారాన్ని నిలుపుకోవాలన్నా, టీడీపీ అధికారంలోకి రావాలన్నా బీసీల మద్దతు చాలా చాలా అవసరం. దశాబ్దాల పాటు టీడీపీనే అంటిపెట్టుకునున్న బీసీ ఓటుబ్యాంకులో మొదటిసారి 2019 ఎన్నికల్లో చీలికొచ్చింది. అందుకనే వైసీపీకి 151 అఖండ మెజారిటి సాధ్యమైంది.
అందుకనే దూరమవుతున్న బీసీ ఓటు బ్యాంకును మళ్ళీ దగ్గర చేసుకోవాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే బీసీ సంక్షేమ సంఘాల నిరసనల్లో పాల్గొంది. అలాగే బీసీలను మరింత ఆకర్షించటమే టార్గెట్ తో జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షంలో ఉన్నపుడే కాదు ఇపుడు కూడా బీసీలకు మంచి ప్రాధాన్యతే ఇస్తున్నారు. కాబట్టి సహజంగానే బీసీల నిరసనలో వైసీపీ ఎంపీలు పొల్గొన్నారు. ఎవరి హిడెన్ అజెండా ఎదైనా బీసీల నిరసనల్లో రెండు పార్టీల ఎంపీలు కలిసింది వాస్తవం. ఇలాగే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా కలిస్తే కేంద్రం దిగిరాదా ?