టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే.. ఫస్ట్.. తమ పార్టీ కార్యకర్తలను, నాయకులను వేధించిన వారి అంతుచూస్తామని.. వెల్లడించారు. ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్ఉటకుంటున్నామని.. చెప్పారు. అదేసమయంలో ప్రతి కార్యకర్తకు టిడిపి అధిష్టానం అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలిపారు.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులతో తాజాగా ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎన్నికల వ్యవస్థను అధికార పార్టీ నాయకులు అపహాస్యం చేశారని మండిపడ్డారు. పోలీసుల్ని అడ్డం పెట్టుకుని… బెదిరింపులు, తప్పుడు కేసులతో అధికార పార్టీకి వంత పాడారనీ అన్నారు. ముఖ్యంగా పోటీ చేసే అభ్యర్ధుల్ని, వారి బంధువుల్ని పోలీస్ స్టేషన్లో ఉంచి.. కనీసం ఎన్నికల ప్రచారం కూడా చేయనివ్వకుండా అడ్డుకున్నారని నిప్పులు చెరిగారు.
కొంత మంది అభ్యర్ధులకు డబ్బు ఎర చూపి, మరికొందరిని వ్యాపారాలు మూయించేస్తామని బెదిరించారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ గెలుపు తధ్యమని భావించిన వార్డుల్లో ఓటర్లను బెదిరించడం, పోలింగ్ శాతం తగ్గించడం కోసం ఓట్ల తారుమారు వంటి అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. ఎన్నికల వ్యవస్థను ప్రభుత్వం దిగజార్చిన విషయం రాష్ట్రమంతా చూస్తోందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికలను హైజాక్ చేస్తూ అపహాస్యం చేయడాన్ని ఆక్షేపించారు. కష్టబడి, ప్రజల్లో అభిమానం పొందిన నాయకులకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. అదే సమయంలో తప్పుడు కేసులతో వేధింపులకు దిగుతున్న అధికారులకు తగిన బుద్ధి చెప్పడం తధ్యమనీ హెచ్చరించారు. కార్యకర్తలు భయపడకుండా పోరాడినప్పుడే వ్యక్తిగా, వ్యవస్థగా ముందుకు సాగగలమని సూచించారు.