పార్టీ పెట్టి దాదాపు ఆరేళ్ళవుతున్నా ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. భవిష్యత్తులో జనాలు ఆదరిస్తారనే సూచనలు కూడా కనబడటం లేదు. పోటీచేసిన ప్రతి ఎన్నికలోను ఓడిపోవటమే తప్ప గెలుపు అవకాశాలే కనబడలేదు. ఇదంతా ఎవరి విషయంలో అనుకుంటున్నారా ? అదేనండి భారతీయ చలన చిత్రసీమలో ప్రముఖ నటుడు కమలహాసన్ గురించే. అవును మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ గురించే ఇదంతా. తాజాగా కరోనా వైరస్ బారిన పడి కోలుకుంటున్న కమల్ కు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారట.
ఆసుపత్రి నుంచి 4వ తేదీన డిశ్చార్జ్ అవుతున్నా మరికొద్ది రోజుల పాటు కమల ఎవరినీ కలిసే అవకాశం లేదని సమాచారం. దాంతో జనవరిలో తమిళనాడులో జరగబోతున్న మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ పోటీచేసేది అనుమానమైపోయింది. ఒకవైపు ఓటు బ్యాంకు తగ్గిపోతోంది. మరోవైపు ఓటు బ్యాంకు పుంజుకునే అవకాశాలూ కనపడటం లేదు. పార్టీ పెట్టిన తర్వాత మొదటిసారి పార్లమెంటు ఎన్నికల్లో పర్వాలేదని అనిపించుకున్న ఓట్ల శాతం తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా పడిపోయింది.
ఆ తర్వాత జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పార్టీకి అసలు ఓట్లే పడలేదు. ఈ పార్టీ విషయం ఇలాగుంటే మరో ప్రముఖ నటుడు విజయ్ పేరు చెప్పుకుని పోటీ చేసిన అభ్యర్థులు చాలా మంది గెలిచారు. విజయ్ అసలు పార్టీయే పెట్టలేదు, తన పేరు చెప్పుకుని పోటీ చేసిన వారి తరపున ప్రచారం కాదుకదా కనీసం ఓటేయమని కూడా అడగలేదు. కానీ వంద మందికి పైగా అభిమానులు గెలిచారు. దాంతో రెండు పార్టీల మధ్య కంపారిజన్ చేసుకున్న జనాలు కమల్ పని అయిపోయిందనే ప్రచారం పెరిగిపోతోంది.
ఈ నేపథ్యంలో కమల్ కు కరోనా వైరస్ సోకింది. దాంతో కొద్దికాలం జనాలెవరినీ కలిసే అవకాశాలు లేవు. కాబట్టి జనవరిలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో అభ్యర్థుల పోటీపై కసరత్తు కూడా జరిగే అవకాశాలు తక్కువే. కరోనా కారణంగానే సినిమా షూటింగులను కూడా కమల్ వాయిదా వేసుకున్నారు. ఇదే సమయంలో కమల్ పై వయసు ప్రభావం కూడా తీవ్రంగానే కనబడుతోంది. వీటన్నింటి కారణంగా ప్రస్తుతం కమల్ రాజకీయాలకు ఇంటర్వెల్ ప్రకటిస్తున్నట్లు పార్టీ ప్రచార విభాగం ప్రకటించింది కానీ కమల్ రాజకీయాలకు దాదాపు గుడ్ బై చెప్పినట్లే అనే ప్రచారం పెరిగిపోతోంది.