జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశ్వసనీయతకు పెద్ద పరీక్షే ఎదురవుతోందని అంటున్నారు పరిశీలకులు. సాధారణంగా.. అటు సినీ రంగంలోనూ.. ఇటు పొలిటికల్‌గానూ.. చక్రం తిప్పుతున్న పవన్.. అంటే.. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వాటిని ఓట్లు వేయించుకునేలా.. ఆయన మలుచుకోలేక పోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ఓట్ల సంగతి పక్కన పెడితే.. పవన్‌కు ఇప్పుడు విశ్వసనీయతపైనే పెద్ద సవాల్ ఎదురవుతోంది. ఆయన గతంలో సభలు పెడితే.. పెద్ద ఎత్తున యువత వచ్చేవారు. ఇప్పుడు కూడా వస్తున్నారు.
కానీ, గతంలో పవన్ ఏదైనా పిలుపుఇస్తే.. వెంటనే ప్రభుత్వాలు చేసేవి. ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లా కిడ్నీ సమస్యను పవన్ వెలుగులోకి తీసుకురాగానే.. చంద్రబాబు ప్రభుత్వం అక్కడ యుద్ధ ప్రాదిపదికన చర్యలు తీసుకుంది. జగన్ సర్కారు కూడా.. అక్కడి బాధితులకు పింఛన్లు ఇస్తోంది. వైద్యం కూడా అందిస్తోంది. ఇక, ఇటీవల అక్టోబరు 2న పవన్.. శ్రమదానం పేరిట.. ఏపీలో రోడ్లను బాగు చేసేందుకు నడుం బిగించి.. ఉద్యమానికి రెడీ అయ్యారు. దీంతో జగన్ సర్కారు.. తనే స్వయంగా అప్పటికప్పుడు రంగంలోకి దిగి.. గుంతలను పూడ్చే కార్యక్రమాలను తీసుకువచ్చారు.
ఇక, ఇంత వరకుబాగానే ఉంది. కానీ.. పవన్ వ్యాఖ్యలకు ఇటీవల విలువ లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వారంలోగా అఖిల పక్షం వేయాలని.. పవన్ పిలుపునిచ్చారు. అదేవిధంగా నవంబరు.. 20 నాటికి రోడ్లన్నింటినీ బాగు చేయాలని.. డెడ్‌లైన్లు విధించారు. ఇక, ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థపైనా.. అఖిలపక్షం వేయాలని.. సినీ రంగం పెద్దలతో చర్చించాలని అన్నారు. ఇవన్నీ.. ఇటీవల జరిగినవే. అయితే.. వీటిలో ఏదీ కూడా.. ప్రభుత్వం పాటించలేదు.
కనీసం.. వాటిపై దృష్టి కూడా పెట్టలేదు. దీంతో పవన్ పై విశ్వసనీయత సన్నగిల్లుతోందని అంటున్నారు. పైగా.. చంద్రబాబు కన్నీరుపై స్పందించిన తీరు కూడా.. పవన్‌కు మైలేజీ ఇవ్వలేదు. గతంలో టీడీపీలోని యువత కూడా పవన్ విషయంలో పాజిటివ్‌గా ఉండేది. అయితే.. తాజా కన్నీరు విషయంలో పవన్ స్పందించిన తీరును వారు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో పవన్‌పై విశ్వసనీయత తగ్గుతోందనే భావన వ్యక్తం కావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates