తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఈ (సోమవారం) తెల్లవారుజామున గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందారు. తిరుమల నుంచి ఆయన విశాఖపట్నానికి కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్లిన ఆయనకు గుండెపోటు రావటం.. వెనువెంటనే ఆసుపత్రికి తరలించే లోపే ఆయన ప్రాణాలు పోయినట్లుగా చెబుతున్నారు.
నిత్యం శ్రీవారి సేవలో మునిగి డాలర్ శేషాద్రి.. తిరుమల అర్చకులన్నంతనే భక్తులకు గుర్తుకు వస్తారు. తెలుగు వారికే కాదు.. శ్రీవారి భక్తులందరికి సుపరిచితులైన ఆయన జీవితాన్ని చూస్తే.. ఎత్తుపల్లాలు బోలెడన్ని కనిపిస్తాయి. ఆయన పేరు పలు వివాదాలతో ముడిపడి ఉంటుంది. అయితే.. వీవీఐపీ భక్తులు.. ప్రముఖులు పలువురు ఆయనకు విపరీతమైన ప్రాధాన్యతను ఇస్తుంటారు.
1978లో శ్రీవారి సేవలో మునిగిన ఆయన నిర్విరామంగా 43 ఏళ్ల పాటు తిరుమలలోనే ఉన్నారు. 2007లో రిటైర్మెంట్ తీసుకున్నప్పటికి.. శ్రేషాద్రి సేవలు టీటీడీకి అవసరమని భావించి ఆయన్ను ఓఎస్డీగా కొనసాగిస్తున్నారు.మరణానికి ముందు వరకు శ్రీవారి సేవలోనే మునిగిన ఆయన.. తుదిశ్వాస మాత్రం తిరుమల గడ్డ మీద కాకుండా విశాఖలో విడవటం గమనార్హం.
డాలర్ శేషాద్రి మరణం తిరుమల తిరుపతి దేవస్థానానికి తీరని నష్టమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలకు వచ్చే ప్రముఖులు పలువురు.. ఆయన చేతుల మీదుగా తీర్థప్రసాదాలు తీసుకునేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు.టీటీడీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద ఈ రోజు (సోమవారం) కార్తీక మహా దీపోత్సవాన్ని నిర్వహించటానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న వేళలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.
ఈ కార్యక్రమానికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఈవో జవహర్ రెడ్డి.. శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి హాజరు కావాల్సి ఉంది.
ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వేల మంది భక్తులు హాజరవుతారన్న అంచనా ఉంది. విశాఖలోని ఎంవీపీ కాలనీలో ఉన్న టీటీడీ ఈ-కౌంటర్ లో భక్తులకు పాసులు జారీ చేశారు. ఇంత పకడ్బందీగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వేళ.. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం షాకింగ్ గా మారింది. శ్రీవారి భక్తులు.. టీటీడీ వర్గాలు డాలర్ శేషాద్రి హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.