జ‌గ‌న్‌ పై యుద్ధ‌మే.. ఉద్యోగుల నిర్ణ‌యం..

ఏపీ ఉద్యోగులు పోరుబాట‌ను ఎంచుకున్నారు. ఇక‌, ప్ర‌భుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు వారు రెడీ అయ్యారు. త‌మ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు.. గ‌తంలో పాద‌యాత్ర స‌మ‌యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇచ్చిన హామీలు నెర‌వేర‌లేద‌ని.. ముఖ్యంగా పీఆర్ సీ వంటి కీల‌క‌మైన‌.. అంశాల్లోనూ ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని.. ఉద్యోగ సంఘాలు.. కొన్ని నెల‌లుగా ఆరోపిస్తున్నాయి. అదేస‌మ‌యంలో ఎన్నిక‌ల‌కు ముందు.. సీపీఎస్ పింఛ‌ను విధానాన్ని ర‌ద్దు చేస్తామ‌ని.. అధికారంలోకి వ‌చ్చిన వారంలోనే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టి రెండున్న‌రేళ్లు అయిన‌ప్ప‌టికీ.. మౌనంగా ఉండ‌డంపై ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే కొన్నాళ్ల కింద‌ట నుంచి ప్ర‌భుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. వాస్త‌వానికి గ‌త ఏడాది ప్ర‌భుత్వంతో క‌లిసి మెలిసి పోయిన‌.. ఉద్యోగులు.. అప్ప‌టి ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌తో వివాదానికి దిగి సంచ‌ల‌నం సృష్టించారు. ప్ర‌భుత్వానికి అనుకూలంగా మీడియా ముందుకు వ‌చ్చారు. అయితే.. ప్ర‌భుత్వంపై ఉద్యోగులు పెట్టుకున్న ఆశ‌లు ఏ ఒక్క‌టీ నెర‌వేర‌ని నేప‌థ్యంలో ఇప్పుడు.. వారు తీవ్ర ఆందోళ‌న‌, ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఉద్య‌మాల‌కు తెర‌దీయాల‌ని చూస్తున్నారు. దీనిలో భాగంగా డిసెంబ‌రు 1న ప్ర‌భుత్వానికి నోటీసులు అందించాల‌ని నిర్ణ‌యించారు.

తాజాగా మీడియా ముందుకు వ‌చ్చిన‌.. ప్ర‌భుత్వ ఉద్యోగుల సంఘం.. అమ‌రావ‌తి జేఏసీ, అమ‌రావ‌తి ఉద్యోగుల సంఘం.. ఇలా అంద‌రూ ఒకే మాట‌పై నిల‌బ‌డ్డారు. క‌నీసం ఒక‌టో తారీకున జీతాలు కూడా ఇవ్వ‌లేక‌పోతోంద‌ని.. ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఉద్య‌మం త‌ప్ప‌.. త‌మ‌కు ప్ర‌త్యామ్నాయం లేద‌ని వెల్ల‌డించారు. ఉద్యోగుల‌ను ప్ర‌భుత్వం చాలా చిన్న‌చూపు చూస్తోంద‌ని వ్యాఖ్యానించారు. పీఆర్‌సీ, పెండింగ్ బ‌కాయిలు.. సీపీఎస్‌, రిటైర్డ్ ఉద్యోగుల సమ‌స్య‌ల‌ను ప్ర‌ధానంగా చ‌ర్చిస్తు న్నారు. డిసెంబ‌రు 16 నుంచి అన్ని తాలూకా కేంద్రాల్లోనూ ధ‌ర్నాలు, నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చారు. డిసెంబ‌రు 21 నుంచి 26 వ‌ర‌కు జిల్లాల ప్ర‌ధాన కేంద్రాల్లో నిర‌స‌న‌లు, ధ‌ర్నాలు వ్య‌క్తం చేస్తారు. అదేవిధంగా డిసెంబ‌రు 27న విశాఖ‌.. 30న తిరుప‌తి, జ‌న‌వ‌రి 3న ఏలూరుల్లో ప్రాంతీయ స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.

ఇదీ.. కార్యాచ‌ర‌ణ‌..

  • 1వ తేదీన ఏపీ సీఎస్ కు వినతి పత్రం.
  • 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు.
  • 10వ తేదీన నల్ల బ్యాడ్జీలతో మధ్యాహ్నం భోజనం సమయంలో నిరసన.
  • 1వ తేదీన జిల్లాల కేంద్రాల్లో నిరసన
  • జిల్లా తాలూకా కేంద్రాలలో 16వ తేదీన ధర్నాలు.
  • 21న జిల్లా కేంద్రాల్లో రెండు గంటల వరకు మహా ధర్నా.
  • 27 విశాఖ, 30న తిరుపతి, 3న ఏలూరు, 6న ఒంగోలులో భారీ ప్రాంతీయ సదస్సులు.