కొద్ది రోజుల క్రితం అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ సభ్యుల అనుచిత వ్యాఖ్యల వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి వ్యక్తిత్వ హననానికి వైసీపీ నేతలు పాల్పడ్డారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. అయితే, తాము భువనేశ్వరిని ఏమీ అనలేదని అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తాము చంద్రబాబును అంటామని, భువనేశ్వరిని అనాల్సిన పనిలేదని మీడియా ముందు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఇక, ఆ గందరగోళానికి కారణమైన వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డులనుంచి కూడా తొలగించారు. కానీ, ఆ వ్యాఖ్యలను కొందరు టీడీపీ సభ్యులు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైసీపీ నేతల గుట్టురట్టయింది. దీంతో, ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్లు చేశారు. పరోక్షంగా వైసీపీ సభ్యులు ఆ వ్యాఖ్యలు చేశారని స్వయంగా బొత్స అంగీకరించడం సంచలనంగా మారింది.
అసెంబ్లీలో జరిగిన ఘటనను సమర్థించడం లేదన్న బొత్స…తాము చెప్పిందే వినాలన్న పద్ధతిని ప్రతిపక్షాలు వీడాలని హితవుపలికారు. ఇప్పటివరకు తానెప్పుడూ గట్టిగా మాట్లాడలేదని, అందరినీ ఒకే గాటన కట్టడం సరికాదని అన్నారు. ఆ రోజు శాసనసభలో తాను కూడా ఉన్నానని, పక్కనుంచి ఎవరో వచ్చి కామెంట్ చేస్తే అది కౌంట్ అవుతుందా? అని ప్రశ్నించారు. అయితే, దానికి తాను వత్తాసు పలకడం లేదన్న బొత్స…. పక్కనున్న వారు కామెంట్ చేస్తే తానుగానీ, స్పీకర్ గానీ ఎలా బాధ్యులమవుతామని ప్రశ్నించారు.
అసెంబ్లీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు అటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని బొత్స హితవు పలికారు. గతంలో తమ పార్టీ నేతలను చంద్రబాబు కించపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయని బొత్స అన్నారు. చంద్రబాబు ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు నిర్వహిస్తున్నారని, తమకంటే ఆడవాళ్లను గౌరవంగా చూసేవాళ్లు ఎవరున్నారు? అని ప్రశ్నించారు. మహిళలకు జగన్ అత్యంత ప్రాధాన్యతనిచ్చారని, అటువంటి నాయకుడు మరొకరు లేరని అన్నారు. తాము ప్రజల తీర్పునకు ఎల్లపుడూ సిద్ధమని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates