వైసీపీ అధినేత, సీఎం జగన్ దృష్టి ఎవరిపై ఉంది? మరో 30 ఏళ్లపాటు తానే సీఎంగా ఉంటానని ఆయన ఎందుకు అంత ధైర్యంగా చెబుతున్నారు. తొణికిసలాడుతున్న ఆత్మ విశ్వాసం వెనుక ఉన్న రీజనేంటి? ఇదీ.. ఇప్పుడు మేధావులను ఆలోచింపజేస్తున్న విషయం. ఒకటి.. తాను ప్రవేశ పెట్టిన పథకాలతో ప్రజలు ఆనందంగా ఉన్నారని.. ఇదే తనకు శ్రీరామరక్ష అవుతుందని.. జగన్ భావిస్తున్నారా? లేక.. తను పాటిస్తున్న సోషల్ ఇంజనీరింగ్ తనకు అండగా నిలుస్తుందని అనుకుంటున్నారా? ఈ రెండు విషయాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి.
ఇటీవల వచ్చిన వరదలు.. వర్షాలే కాదు.. గతంలోనూ అనేక సంఘటనలు జరిగినప్పుడు.. సీఎం జగన్ పెద్దగా క్షేత్రస్థాయిలో పర్యటించింది లేదు. దీంతో విపక్షాలు ఆయనపై నిప్పులు చెరిగాయి. దీంతో సహజంగానే జగన్పై వ్యతిరేకత వచ్చేసిందనే భావన ఏర్పడింది. కానీ, ఎక్కడా జగన్ తొణకలేదు. బెణకలేదు. ఇప్పుడు కూడా అదేవిధంగా ఉంటున్నారు. మరి దీనికి కారణం.. ఏంటి? అంటే.. పథకాలు కాదు. పైకి జగన్ అమలు చేస్తున్న పథకాలే తమను రక్షిస్తాయని పార్టీ నేతలుచెబుతున్నా.. గత అనుభవాల దృష్ట్యా.. జగన్వాటిపై నమ్మకం పెట్టుకోలేదు.
కేవలం.. సామాజిక వర్గాల సమీకరణలు.. పదవులు ఇవ్వడం.. ముఖ్యంగా మహిళా ఓటు బ్యాంకును చాప కిందనీరులా.. తనవైపు తిప్పుకోవడంలో ఆయన సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే 33 శాతం పదవులను జగన్ మహిళలకు ఇచ్చారు. గతంలో ఎన్నడూ పదవులు దక్కుతాయని అనుకోని గృహిణులను తీసుకు వచ్చి.. రాజ్యాంగ బద్ధమైన సీట్లలో కూర్చోబెడుతున్నారు. నిజానికి ఇది పెను సంచలనం. పైకి చిన్నది అని అనుకున్నా.. కీలకమైన ఓటు బ్యాంకును ప్రభావితం చేయగల అంశం. అంతేకాదు.. ఎన్ని పథకాలు ఇచ్చినా.. ఏవో కావాలనే ఆశ ఉంటుంది.
అదేసమయంలో అన్ని వర్గాలకు ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి కూడా ఉండదు. కానీ, సామాజిక వర్గాలకు న్యాయం చేయడం ద్వారా.. అది కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆర్థిక బలం లేని పేదలకు పదవులు ఇవ్వడం ద్వారా ఆయా సామాజిక వర్గాలను అనూహ్యంగా తనవైపు తిప్పుకొనే మంత్రాన్ని జగన్ పఠిస్తున్నారు. దీనికి నేతలతో పనిలేదు. నాయకుల మెప్పు అవసరమూ లేదు. సామాజిక వర్గాలను ప్రభావితం చేయగలిగితే చాలు. అదే తనకు శ్రీరామరక్షగా జగన్ భావిస్తున్నారు.