చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండకపోవటం రాజకీయ నేతల ప్రాథమిక లక్షణమే అయినా..కొన్ని ప్రత్యేకమైన విషయాల్లోనూ ఇదే తీరును ప్రదర్శిస్తారా? అంటే అవునన్న విధంగా తాజా పరిణామం ఉందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకు? అన్న ప్రశ్నను సంధిస్తే.. చిన్నపిల్లాడు సైతం సమాదానం చెప్పేస్తారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయాల్ని ప్రశ్నించేందుకు.. కేంద్రంలో అమీతుమీ తేల్చేసేందుకు తాను ఢిల్లీ వెళుతున్నట్లుగా కేసీఆర్ చెప్పటం తెలిసిందే.
ధాన్యం కొనుగోలు అంశంపై ధర్నా చౌక్ లో మహాధర్నాను నిర్వహించిన ఆయన.. ఆ వెంటనే ఢిల్లీకి పయమనయ్యారు. సాధారణంగా ప్రధానమంత్రిని కలవాలన్నదే లక్ష్యమైతే.. ముందస్తుగా అపాయింట్ మెంట్ తీసుకొని వెళతారు. అందుకు భిన్నంగా ఈసారి మాత్రం సీఎం కేసీఆర్.. అలాంటిదేమీ లేకుండా ఏకాఏకిన ఢిల్లీకి వెళ్లారు. దాదాపు మూడున్నర రోజులు దేశ రాజధానిలో ఉన్న ఆయన.. బుధవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోవటం తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలవాలన్న ఆలోచనతోనే కేసీఆర్ ఢిల్లీ టూర్ సాగినట్లుగా టీఆర్ఎస్ నేతలు చెప్పుకున్నారు. కానీ.. వారు అపాయింట్ మెంట్ ఇవ్వని కారణంగా తమ అధినేత హైదరాబాద్ కు తిరిగి వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఇలాంటివేళ.. ప్రధానమంత్రి కార్యాలయం ఆసక్తికర ప్రకటన చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవటానికి వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయం కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ కేంద్రానికి ఎలాంటి వినతి రాలేదని స్పష్టం చేయటం గమనార్హం.
గత సెప్టెంబరు ఒకటిన అపాయింట్ మెంట్ కోసం వినతి వచ్చిందని.. అదే నెల మూడున అపాయింట్ మెంట్ ఇచ్చారని.. ఆ సందర్భంగా ప్రధాని మోడీని సీఎం కేసీఆర్ కలిశారని పేర్కొంది. నీటి పంపకాలు.. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవటానిక ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా చెప్పి.. ప్రధానిని తాను కలవనున్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్పటం.. అందుకు తగ్గట్లే దేశ రాజధానికి వెళ్లటం తెలిసిందే.
మరి.. ప్రధానమంత్రి మోడీ.. హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కోరకుండానే.. ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు? ఆ టూర్ ఎవరి కోసం? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దాదాపు నాలుగురోజులు ఢిల్లీలోనే తమ అధినేత ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోడీ తమకు టైమివ్వలేదని టీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి. ఇలాంటివేళ.. కేంద్ర ప్రభుత్వం తాజా స్పష్టతను ఇచ్చింది.
దీంతో.. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోసం కేసీఆర్ ప్రయత్నించలేదన్న విషయం స్పష్టమవుతుంది. మరి.. ప్రధాని.. హోంమంత్రిని కలవటానికి కాకుంటే.. కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వెళ్లినట్లు? తాజాగా కేంద్రం నుంచి వెలువడిన ప్రకటన.. కేసీఆర్ గాలి తీసేసినట్లుగా మారిందని చెప్పాలి. మరి.. ఢిల్లీ టూర్.. ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ గురించి సీఎం కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.