వెన‌క్కి త‌గ్గ‌కు.. జ‌గ‌న్‌కు కేసీఆర్ హిత‌బోధ‌?

వెన‌క్కి త‌గ్గ‌కు.. జ‌గ‌న్‌కు కేసీఆర్ హిత‌బోధ‌?టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయకుడు, వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబానికి ఒక‌ప్ప‌టి విధేయ నాయ‌కుడిగా పేరున్న పోచారం శ్రీనివాస‌రెడ్డి మ‌న‌వ‌రాలి వివాహం ఆదివారం జ‌రిగింది. శంషాబాద్‌లో అత్యంత ఘ‌నంగా జ‌రిగిన ఈ వివాహానికి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను పోచారం ఆహ్వానించారు. దీంతో ఒక‌వైపు రాష్ట్రంలో వ‌ర‌ద‌లు ఉన్న‌ప్ప‌టికీ.. బిజీ షెడ్యూల్‌ను ప‌క్క‌న పెట్టిమ‌రీ.. జ‌గ‌న్ ఈ వివాహానికి హాజ‌ర‌య్యారు. వాస్త‌వానికి ఆయ‌న వెళ్తున్న‌ట్టు ఆదివారం ఉద‌యం వ‌ర‌కు నిర్ధార‌ణ కాలేదు. కానీ, ఇంత‌లోనే ‘ఒక ఫోన్‌’ రావ‌డంతో ఆయ‌న హుటాహుటిన స్వ‌యంగా వివాహానికి హాజ‌ర‌య్యారు. ఇదే వివాహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా వ‌చ్చారు.

ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు నేత‌లుకూడా ఒకే సీటులో ప‌క్క ప‌క్క‌నే కూర్చుని దాదాపు 15 నిముషాల పాటు.. చ‌ర్చించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల హావ‌భావాల‌ను బ‌ట్టి.. ముఖ్యంగా జ‌గ‌న్ హావ‌భావాల‌ను బ‌ట్టి.. శుక్ర‌వారం ఏపీ అసెంబ్లీలో ఏం జ‌రిగింద‌న్న విష‌యాన్ని కేసీఆర్‌కు ఆయ‌న వివ‌రించార‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

త‌మ త‌ప్పు లేక‌పోయినా.. అస‌లు స‌భ‌లో చంద్ర‌బాబు కుటుంబ స‌భ్యుల ప్ర‌స్తావ‌న లేకపోయినా.. ఆయ‌న కావాల‌నే యాగీ చేశార‌ని.. జ‌గ‌న్‌.. కేసీఆర్‌కు వివ‌రించారు. నంద‌మూరి కుటుంబాన్ని తాము ప‌న్నెత్తు మాట అన‌లేద‌ని.. పైగా టీడీపీ స‌భ్యులే త‌మ‌ను రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగానే చిన్నాన్న హ‌త్య‌పై కామెంట్లు చేశార‌ని కూడా జ‌గ‌న్ చెప్పిన‌ట్టు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో జోక్యం చేసుకున్న కేసీఆర్..రాజ‌కీయాల్లో ఇలాంటివి మామూలేనని.. కాక‌పోతే.. ఇప్పుడు మ‌రింత దూకుడు పెరిగింద‌ని..ఏదేమైన‌ప్ప‌టికీ.. నువ్వు వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని.. కేసీఆర్ హిత‌బోధ చేసిన‌ట్టు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


అంతేకాదు.. చంద్ర‌బాబును మ‌రింత టార్గెట్ చేయాల‌ని కూడా.. కేసీఆర్ సూచించి ఉంటార‌ని.. ఒక్క‌సారి వెన‌క్కి త‌గ్గితే.. మ‌ళ్లీ చంద్ర‌బాబు పుంజుకునే అవ‌కాశం ఉంటుంద‌ని కూడా కేసీఆర్ వ్యాఖ్యానించి ఉంటార‌ని అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల సంవాదం ఇప్పుడు అత్యంత ఆస‌క్తిగా మార‌డం విశేషం.