క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. తాజాగా ఏబీపీ-సీఓటర్ లాంటి సంస్ధలు నిర్వహించిన ప్రీపోల్ సర్వేల్లో ఆప్ కే పట్టం కట్టాయి. 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్ లో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే అవకాశముందని సర్వే ఫలితాలను బట్టి తేలుతున్నాయి. 117 సీట్లలో ఆప్ కు 51 సీట్లు రావటం ఖాయమని సర్వే ఫలితాలను బట్టి తేలుతోంది.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 77 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 20 మంది ఎంఎల్ఏలతో ఆప్ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. శిరోమణి అకాలీదళ్ 18 సీట్లు తెచ్చుకుంది. నిజానికి రేపటి ఎన్నికల్లో కూడా మళ్ళీ కాంగ్రెస్సే తిరిగి అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉండేవి. అయితే పార్టీతో పాటు ప్రభుత్వంలో మొదలైన సంక్షోభం కారణంగా జనాల్లో కాంగ్రెస్ అంటేనే బాగా విసుగొచ్చేసింది.
అధికారం కోసం నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూకి సీఎంగా ఉన్నపుడు కెప్టెన్ అమరీంద్ సింగ్ తో మొదలైన విభేదాలు చివరకు పార్టీని సంక్షోభంలోకి కూరుకుపోయేట్లు చేసింది. సిద్ధూ బాధ పడలేక వేరే దారిలేక సీఎంగా అమరీందర్ రాజీనామా చేసి తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసేశారు. 2017 ఎన్నికల్లో 20 సీట్లు తెచ్చుకున్న ఆప్ రాష్ట్రంతో పాటు అసెంబ్లీలో కూడా మంచి ప్రతిపక్షమనే అనిపించుకున్నది. ఇపుడు సమస్య ఏమిటంటే తీవ్రమైన సంక్షోభం కారణంగా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాన్ని చేజేతులారా చెడగొట్టుకుంటోంది.
అలాగే శిరోమణి అకాలీదళ్ కూడా జనాల్లో విశ్వాసాన్ని పొందలేకపోతోంది. ఎందుకంటే మొన్నటి వరకు ఎన్డీఏలో అకాలీదళ్ భాగస్వామిగా ఉండటమే అతి పెద్ద మైనస్ అయింది. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రివర్గంలో నుండి అకాలీదళ్ బయటకు వచ్చినా ఇంకా ఎన్డీయేలో మాత్రం కంటిన్యూ అవుతోంది. అసలే రైతులకు మోడీ అంటే మండిపోతోంది. ఈ నేపధ్యంలోనే ఇటు అకాలీదళ్ కు ఓట్లు వేయలేక అటు కాంగ్రెస్ అంటే వ్యతిరేకత పెరిగిపోతోంది. అందుకనే మధ్యేమార్గంగా ఆప్ వైపు జనాలందరూ చూస్తున్నారట.
ఒకవేళ సర్వేలు కనుక నిజమైతే ప్రతిపక్షంలో ఉంటు రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పార్టీగా ఆప్ చరిత్ర సృష్టిస్తుందేమో. దేశంలోని ఏ రాష్ట్రంలో తీసుకున్నా అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీ రెండో రాష్ట్రంలో ఎక్కడా అధికారాన్ని దక్కించుకోలేదు. తృణమూల్, ఎన్సీపీ, ఎస్పీ, బీఎస్పీ, టీడీపీ, ఏఐఏడీఎంకే లాంటి చాలా పార్టీలు తమ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చాయి. అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో పోటీ చేశాయి.
అయితే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసినప్పుడు ఒకటి అరా సీట్లు తెచ్చుకున్నాయేమో కానీ ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రాలేకపోయాయి. ఆ ఘనతను రాబోయే ఎన్నికల్లో ఆప్ సాధిస్తుందేమో. ఎందుకంటే ఇప్పటికే 15 ఏళ్లుగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ అధికారంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి కేజ్రీవాల్ రికార్డు సృష్టిస్తారో లేదో చూడాల్సిందే.