కేసీఆర్‌కు ఛాన్స్ ఇవ్వ‌ని మోడీ!

రాజ‌కీయాల్లో ఇదొక చిత్రం! తాను ఒక‌టి త‌లిస్తే.. మ‌రొక‌టి జ‌రిగిన‌ట్టుగా ఉంది.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. ఆయ‌న ఏద‌నుకున్నా.. జ‌రిగి తీరాల్సిందే. తాను అనుకున్నది సాధించే వ‌ర‌కు కూడా నిద్ర‌పోని నాయ‌కుడిగా.. ఎంత‌కైనా తెగించే నేత‌గా కేసీఆర్ గుర్తింపు పొందారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు ఎవ‌రు అడ్డు ఒచ్చినా.. త‌ల ఒంచేది లేద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అయితే.. ఇప్పుడు అధికారంలో ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఉద్య‌మ బాట ప‌ట్టారు. రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం సేక‌రించే విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుతో క‌య్యానికి సిద్ధ‌మ‌య్యారు.

‘కొంట‌రా! కొన‌రా?’ అంటూ.. గురువారం పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని వేడెక్కించారు. త‌నే స్వ‌యంగా ఉద్య‌మం లో పాల్గొన్నారు. ప్ర‌భుత్వంలో ఉంటూ.. స్వ‌యంగా ముఖ్య‌మంత్రిగా ఆయ‌నే రోడ్డెక్కారు. ధ‌ర్నా చేశారు. మంత్రుల‌ను క‌దిలించారు. “ఇది అంతం కాదు.. ఆరంభం” అంటూ.. గ‌త ఉద్య‌మం తాలూకు డైలాగుల ను పేల్చారు. త్వ‌ర‌లోనే ఢిల్లీవెళ్లి ఉద్య‌మం చేస్తామ‌న్నారు. అంతేకాదు.. మూడు సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా.. ఉద్య‌మిస్తున్న ఉత్తరాది రైతుల‌తో క‌లిసి ఉద్య‌మిస్తామ‌ని కూడా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయాలు ఒక్క‌సారిగా వేడెక్కాయి. ఇక‌, బీజేపీకి, కేసీఆర్‌కు యుద్ధ‌మేన‌నే సంకేతాలు ఇచ్చేశారు.

అయితే.. యాదృచ్ఛికంగా.. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. ఏ విష‌యంపై అయితే.. కేసీఆర్ ఉద్య‌మిస్తాన‌ని ప్ర‌క‌టించారో.. ఆ ఉద్య‌మం ఆధారంగా.. ఢిల్లీలో రోడ్డెక్కుతాన‌ని చెప్పారో.. ఏకంగా ఆ ఉద్య‌మ‌మే లేకుండా చేసేశారు. తాజాగా సాగు చ‌ట్టాల‌ను.. వెన‌క్కి తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో కేసీఆర్‌కు ఉద్య‌మించే ఛాన్స్ లేకుండా చేసేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదేస‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం.. అంటూ.. రైతుల నుంచి ధాన్యం సేక‌రించే విష‌యంలోనూ.. నాలుగు నెల‌ల కింద‌టే తాముకేసీఆర్ స‌హా అన్ని రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు విశ‌ద‌ప‌రిచామ‌ని కూడా కేంద్రం గురువార‌మే చెప్పేసింది.

దీనికి సంబంధించి ముఖ్య‌మంత్రుల‌తో నిర్వహించిన స‌మావేశం తాలూకు మినిట్స్‌ను అధికారులు మీడియాకు చూపించారు. ధాన్యం తీసుకునేది లేద‌ని .. తాము ఎప్పుడో చెప్పామ‌ని.. బాయిల్డ్ రైస్‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ తీసుకునేది లేద‌ని.. ఇదంతా.. కేసీఆర్ రాజ‌కీయం కోసం చేస్తున్నార‌ని.. కూడా పేర్కొంది. దీంతో ఇది కూడా కేసీఆర్‌కు బూమ‌రాంగ్ అయింది. సాక్ష్యాలు, ఆధారాల‌తో స‌హా కేంద్రం విరుచుకుప‌డే స‌రికి.. ఆయ‌న‌కు ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కాని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌నిఅంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంగా.. కేసీఆర్ కు మోడీ ఛాన్స్ ఇవ్వ‌లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.