జ‌న‌సేన ఎక్క‌డ‌?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఖాళీగా ఉన్న మున్సిప‌ల్‌, న‌గ‌ర పంచాయ‌తీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ ఆధిప‌త్యం స్ప‌ష్టంగా క‌నిపించింది. దాదాపు అన్ని చోట్లా ఆ పార్టీ జెండా ఎగిరింది. ముఖ్యంగా టీడీపీ కంచుకోట‌ను మ‌రోసారి ఆ పార్టీ బ‌ద్ద‌లు కొట్టింది. అక్క‌డ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. మిగ‌తా చోట్ల కూడా ఈ రెండు పార్టీల మ‌ధ్యే పోటీ న‌డిచింది. కానీ మూడో పార్టీ అస‌లు పోటీలోనే లేకుండా పోయింది. ముఖ్యంగా జ‌న‌సేన పార్టీ దారుణ‌మైన ఫ‌లితాల‌ను సాధించింది. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో ఆ పార్టీ ప్ర‌భావమే క‌నిపించ‌లేదు.

గుర‌జాల న‌గ‌ర పంచాయ‌తీలోని 13వ వార్డులో మాత్ర‌మే జ‌న‌సేన అభ్య‌ర్థి గెలిచారు. మొత్తం 20 వార్డుల్లో ఏక‌గ్రీవ‌మైన వార్డుల‌తో క‌లిపి వైసీపీ 16, టీడీపీ 3 చోట్ల గెలిచాయి. ఆ ఒక్క స్థానం మాత్ర‌మే జ‌న‌సేన‌కు ద‌క్కింది. ఆకివీడులో మాత్రం మూడు వార్డుల్లో పార్టీ గెలిచింది. దాచేప‌ల్లి న‌గ‌ర పంచాయ‌తీలో 8వ వార్డులో మాత్ర‌మే ఆ పార్టీ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. రాజంపేట మున్సిపాలిటీ స‌హా గుర‌జాల‌, క‌మ‌లాపురం, ఆకివీడు, దాచేప‌ల్లి, బేతంచ‌ర్ల ద‌ర్శి న‌గ‌ర పంచాయ‌తీలు ఎక్క‌డా జ‌న‌సేన ప్ర‌భావ‌మే లేదు.

ఈ ఏడాది ఏపీలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌లు, ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఆశాజ‌న‌మైన ఫ‌లితాలు సాధించింది. 1209 స‌ర్పంచ్‌లు, 1576 ఉప స‌ర్పంచ్‌లు, 4456 వార్డులు గెలిచామ‌ని అప్పుడు జ‌న‌సేన ప్ర‌క‌టించింది. మొత్తం మీద ఆ ఎన్నిక‌ల్లో 27 శాతం ఓట్లు పార్టీ త‌ర‌పున పోటీ చేసిన‌వాళ్ల‌కు ప‌డ్డాయ‌ని వెల్ల‌డించింది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌తో పాటు కృష్ణా, గుంటూరుల్లో మంచి ఫ‌లితాలు సాధించామ‌ని పేర్కొంది. ఆ త‌ర్వాత ఇటీవ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ ఆ పార్టీ 177 స్థానాల్లో గెలిచింది. ఆ ఎన్నిక‌ల్లో పోలైన ఓట్ల‌లో త‌మ పార్టీకి 25.2 శాతం ఓట్లు ద‌క్కాయ‌ని జ‌న‌సేన నేత‌లు చెప్పారు. ఈ ఫ‌లితాలు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌రింత జోరుగా ముందుకు సాగారు.

కానీ ఇప్పుడు ఈ మిగిలిన స్థానాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో మాత్రం గ‌ట్టి దెబ్బ ప‌డింది. అస‌లు ఆ పార్టీని ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ప‌ట్టించుకోనే లేద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఓ మాట‌పై నిల‌బ‌డ‌ని ప‌వ‌న్ రాజ‌కీయాలు.. స్ప‌ష్ట‌త లేని ఆయ‌న ప్ర‌యాణం.. పార్టీల‌తో పొత్తుల‌పై దాగుడుమూత‌లు ఇలా అన్ని అంశాలు క‌ల‌గ‌లిపి పార్టీని దెబ్బ‌తీశాయ‌ని నిపుణులు అనుకుంటున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెరుగైన ఫ‌లితాల కోసం ఇప్ప‌టి నుంచే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న ప‌వ‌న్‌కు తాజా ఫ‌లితాలు మింగుడుప‌డ‌నివే. మ‌రి ప‌వ‌న్ త‌న రాజ‌కీయ ప్ర‌ణాళిక‌లు మార్చి మ‌రో దారిలో ముందుకు సాగుతారేమో చూడాలి.