దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం కోసం తిరుపతికి వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు. రెండు రోజుల పాటు సమావేశంలో పాల్గొన్న ఆయన.. చివరి రోజు పూర్తిగా బీజేపీ నేతలతోనే మాట్లాడారు. ఏపీలో అధికారంలోకి రావడం కోసం ఏమేం చేయాలనే విషయంపై రాష్ట్ర బీజేపీ నాయకులకు మార్గనిర్దేశం చేశారు. కానీ ఈ పర్యటనలో ఆయన ఒక్కసారి కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిసినట్లుగానీ.. బీజేపీ నేతలతో సమావేశంలో పవన్ గురించి మాట్లాడినట్లు గానీ ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. దీంతో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఆ పార్టీలో అగ్రనేత అమిత్ షా.. పవన్‌ను పట్టించుకోకపోవడం కొత్త చర్చకు దారితీసింది.
2014 ఎన్నికల్లో టీడీపీతో, బీజేపీతో జనసేనాని పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు అన్యాయం చేస్తుందంటూ ఆ పార్టీతో పవన్ బంధం తెంచుకున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకున్నారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా తిరిగి బీజేపీతో కలిశారు. ఇప్పుడు పొత్తు కొనసాగుతూనే ఉంది. ఆ పొత్తులో భాగంగానే తిరుపలి లోకసభ ఉప ఎన్నికలో పోటీ నుంచి జనసేన వెనక్కి తగ్గి.. బీజేపీకి అవకాశం కల్పించింది. కానీ ఇటీవల బీజేపీతో బంధం తెచ్చుకోవాలని పవన్ భావిస్తున్నారనే ప్రచారం వినిపిస్తోంది. బద్వేలు ఉప ఎన్నికలో రాజకీయ విలువల కోసం పోటీ నుంచి తప్పుకున్న జనసేన.. అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎలాంటి మద్దతు ఇవ్వలేదు.
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని పవన్ నిర్ణయించుకున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా విశాఖ వెళ్లి సభలో మాట్లాడారు. కానీ కేంద్రాన్ని ఒక్క మాట అనకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించి ఊరుకున్నారు. ఇప్పుడేమో ఏపీకి వచ్చిన అమిత్ షా.. పవన్‌ను కలవకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికలో ఏపీలో ఎలా అధికారంలోకి రావాలోనని చర్చించేందుకు నిర్వహించిన సమావేశంలోనూ తమతో పొత్తులో ఉన్న పవన్‌ను పిలవలేదు. ఆయన గురించి మాట్లాడలేదు. పార్టీ నాయకులకు కూడా వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే అధికారం దక్కించుకునేందుకు సరైన వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం.
ఏపీలో 2024 ఎన్నికల్లో టీడీపీతో జత కట్టేందుకు జనసేన సముఖంగానే ఉంది. కానీ టీడీపీతో పొత్తు పెట్టుకునే ఉద్దేశం లేదని బీజేపీ ఎప్పటికప్పుడూ స్పష్టం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే వాటికి దూరంగా ఉండాలని బీజేపీ అనుకుని ఉండొచ్చు. మరోవైపు కేంద్రంపై పోరాటానికి పవన్ సిద్ధమైన నేపథ్యంలో ఆయనతో పొత్తు తెచ్చుకోవాలని భావిస్తుండొచ్చు. అందుకే రాష్ట్రానికి వచ్చినా పవన్‌ను అమిత్ షా పట్టించుకోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.