అమరావతి రాజధాని తరలింపు, సీఆర్డీఏ రద్దు చట్టం, పాలనా వికేంద్రీకరణ చట్టాలపై హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పిటిషన్ల విచారణలో జాప్యం జరిగిందని, త్వరగా వీటి విచారణ పూర్తి చేస్తామని నూతన సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు. ఈ క్రమంలోనే నేడు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమరావతి రాజధాని సమస్య కేవలం రైతులదే కాదని, అది రైతుల రాజధాని కాదని, ఏపీ ప్రజలందరి రాజధాని అని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం 30 వేల మంది రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని, దేశంలో ఇన్ని వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన దాఖలాలు లేవని అభిప్రాయపడ్డారు.
ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే మిశ్రా అభిప్రాయపడ్డారు. అమరావతి రైతులు తమ స్వార్థం కోసం ఉద్యమం చేయడం లేదని, ఏపీ రాజధాని కోసం చేస్తున్నారని అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడారని, అది వాళ్ల కోసం పోరాడడం మాత్రమే కాదని అన్నారు. ఆ స్వాతంత్ర్యం కేవలం సమరయోధులకు సంబంధించినది కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని సీజే మిశ్రా స్పష్టం చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించారు. అమరావతి రాజధానిగా ఏర్పడిన నేపథ్యం, అందుకు రైతులు చేసిన త్యాగాలు, ప్రభుత్వం వారితో చేసుకున్న ఒప్పందాలు వంటి పలు అంశాలు కోర్టు దృష్టికి తెచ్చారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates