క‌విత‌క్క ఏ కోటాలో?

తెలంగాణ‌లో మ‌ళ్లీ ఎన్నిక‌ల కోలాహలం మొద‌లైంది. ఎమ్మెల్యేల‌ కోటాతో పాటు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతుండ‌డంతో రాజ‌కీయ చ‌ర్చ జోరందుకుంది. ఎమ్మెల్సీ ప‌ద‌విని ఆశిస్తున్న ఆశావ‌హులు.. నాయ‌కులంద‌రూ కేసీఆర్ నిర్ణ‌యం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయ‌న క‌టాక్షం కోసం ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల పేర్ల‌ను కేసీఆర్ డిసైడ్ చేసిన‌ట్లు స‌మాచారం. ఇక ఇప్పుడు ఆయ‌న దృష్టి స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ప‌డింది. అయితే ఈ కోటా కింద ఆయ‌న త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత కూడా పోటీకి సిద్ధ‌మ‌వుతుందా? అన్న‌ది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది.

క‌విత‌కు ఈ సారి ఎమ్మెల్సీ ప‌ద‌వి గ‌వ‌ర్న‌ర్ కోటాలోనా లేదా స్థానిక సంస్థ‌ల కోటాలో వ‌రిస్తుందా? అన్న‌ది ఉత్కంఠ‌ రేపుతున్న‌ది. గ‌వ‌ర్న‌ర్ కోటాలో నిమాజాబాద్‌కు చెందిన ఆకుల ల‌లిత ఎమ్మెల్సీ ప‌ద‌వి కాలం ముగియ‌గా.. ఇప్పుడు ఎవ‌రు ఏ కోటాలో బ‌రిలో ఉంటార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ‌న‌వ‌రి 4తో క‌విత ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. ఇప్ప‌టికే ఆ స్థానంతో క‌లిపి 12 స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌ల‌కు త్వ‌ర‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది.

2014 లోక‌స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా గెలిచిన క‌విత‌.. 2019లో బీజేపీ అభ్య‌ర్థి అర‌వింద్ చేతిలో ఓడారు. దీంతో కొంత కాలం పాటు ఆమె రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. కానీ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా ఉన్న భూప‌తి రెడ్డి పార్టీ మారి ఆ ప‌ద‌వి పోగొట్టుకున్నారు. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక వ‌చ్చింది. 2020 అక్టోబ‌ర్ 9న జ‌రిగిన ఆ ఉప ఎన్నిక‌లో గెలిచిన క‌విత మ‌ళ్లీ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌డం మొద‌లెట్టారు.

ఇప్పుడు వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 4తో క‌విత ప‌ద‌వీకాలం ముగుస్తుంది. అయితే అంత‌కంటే ముందే ఆమెను గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీని చేస్తార‌నే ప్ర‌చారం గ‌తంలో వినిపించింది. నిజామాబాద్ నుంచి ఆ కోటాలో ఎమ్మెల్సీగా చేసిన ఆకుల ల‌లిత ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఆమె స్థానంలో క‌విత‌ను ఎమ్మెల్సీ చేస్తార‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. కానీ ఇప్పుడు స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో ఆమె ఈ కోటా కింద‌నే బ‌రిలోకి దిగుతుంద‌ని టాక్‌. గ‌వర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ అవుతే కిక్కేముంటుంది? అందుకే ఎన్నిక‌ల బ‌రిలో దిగి గెలిచేందుకే క‌విత మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

మ‌రోవైపు నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ చేసేందుకు ఆ పార్టీలోని మాజీ మంత్రి మాండ‌వ వెంక‌టేశ్వ‌ర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ న‌ర్సిరెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్య‌క్షుడిగా 20 ఏళ్లు ప‌నిచేసిన గంగారెడ్డి, మైనార్టీ నేత ముజీబ్ త‌దిత‌రులు ఆస‌క్తితో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.