కేసీయార్ వ్యవహారం ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. ఏ విషయంలోను చివరివరకు గట్టిగా ఒకేమాటపై నిలబడుతారని అనుకునేందుకు లేదు. ఇపుడు ధాన్యం కొనుగోళ్ళ వివాదంకు సంబంధించి కేంద్రప్రభుత్వంపై కేసీయార్ ఒంటికాలి మీద లేస్తున్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయిస్తున్నారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అనూహ్యంగా ఓడిపోయిన దగ్గర నుండి కేంద్రప్రభుత్వం అంటేనే అంతెత్తున లేస్తున్నారు.
ఉపఎన్నికలో ఎలాగైనా బీజేపీ తరపున పోటీచేసిన ఈటల రాజేందర్ ను ఓడించాలని పట్టుబట్టారు. అయితే తమ అభ్యర్ధే ఓడిపోవటాన్ని తట్టుకోలేకపోతున్నారు. దాంతో మీడియా సమావేశం పెట్టి ముందు తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో మొదలుపెట్టి చివరకు తన అస్త్రాలన్నింటినీ కేంద్రంపైనే వదులుతున్నారు. గడచిన ఏడేళ్ళుగా కేంద్రంపై కేసీయార్ ఈస్ధాయిలో ఎప్పుడూ ఫైర్ కాలేదు. వరుసగా రెండురోజులు మీడియా సమావేశం పెట్టడం ధాన్యం కొనుగోళ్ళ వ్యవహారంలో కేంద్ర విధానాలపై నోటికొచ్చినట్లు మాట్లాడారు.
కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తున్నట్లు చెప్పిన కేసీయార్ ఆ యుద్ధాన్ని ఎంతవరకు చేస్తారో అనుమానమే. ఎందుకంటే గతంలో కూడా డైరెక్టుగా నరేంద్రమోడీపైనే నోటికొచ్చింది మాట్లాడారు. తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఇదే మోడికి ఒంగి ఒంగి దణ్ణాలు పెట్టి శాలువా కప్పి తిరిగి హైదరాబాదొచ్చారు. అప్పటినుండి మోడి గురించి ఒక్కమాట మాట్లాడితే ఒట్టు. కేసీయార్ వైఖరిపై రాజకీయంగా అందరికీ స్పష్టమైన అవగాహనే ఉంది. ఈరోజు చెప్పింది రేపు ఎంతవరకు ఆచరణలోకి తెస్తారన్నది డౌటే.
కేంద్రప్రభుత్వాన్ని కేసీయార్ నోటికొచ్చినట్లు మాట్లాడిన తర్వాత బండి ఆ తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వరుసగా ఎదురుదాడి మొదలుపెట్టారు. దాంతో కేసీయార్ మూడో రోజు అసలు చప్పుడే చేయలేదు. నాలుగో రోజు జల వివాదాలకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ మాట్లాడుతు కేసీయార్ ను వాయించేశారు. అసలు జలవివాదాలకు కేసీయారే కారణమంటు మండిపోయారు. ట్రైబ్యునళ్ళ ఏర్పాటుపై సుప్రింకోర్టులో వేసిన కేసును రెండు రోజుల్లో ఉపసంహించుకుంటామని చెప్పి 8 మాసాలైనా ఎందుకు ఉపసంహరించుకోలేదంటు వాయించేశారు.
షెకావత్ దెబ్బకు ఏమి సమాధానం చెప్పాలో కేసీయార్ అండ్ కో అర్ధం కావటంలేదు. ఒకవైపేమో కేంద్రంపై కేసీయార్ యుద్ధం ప్రకటించేశారని, సై అంటే సై అంటున్నారనే ప్రచారం జరుగుతున్నా చాలామందికి ఎందుకనో నమ్మకం కుదరటంలేదు. ఇందిరాపార్కు దగ్గర కేంద్రం వైఖరికి నిరసనగా కేటీయార్, హరీష్ రావు లాంటి ఆందోళన చేస్తున్నా ఇంకా ఎక్కడో కేసీయార్ ను నమ్మేందుకు లేదని కాంగ్రెస్ నేతలంటున్నారు. మోడీ-కేసీయార్ కలిసే రైతులను, తెలంగాణా ప్రజలను మోసం చేస్తున్నారంటు ఆరోపిస్తున్నారు. మరి ఎవరు ఎవరిని ఏమి చేస్తున్నారో అర్ధం కావటంలేదు.