వైసీపీలో రాజకీయాలు ఇప్పుడున్నట్టుగా.. వచ్చే ఎన్నికల సమయానికి ఉండవనేది ప్రతి ఒక్కరి మాట. ఇది పార్టీలోనూ హల్చల్ చేస్తోంది. ఎవరిని కదిపినా.. వచ్చే ఎన్నికల నాటికి.. ఏం జరుగుతోందో ? అనే చర్చ చేస్తున్నారు. కొందరు ఏకంగా మాకు టికెట్ కూడా దక్కుతుందని అనుకోవడం లేదు.. అనేస్తున్నారు. దీనికి వారేదో తప్పులు చేస్తున్నారని కాదు.. వారిపై వ్యతిరేకత వస్తుందని కూడా కాదు. వైసీపీ అధిష్టానం దృష్టి వేరేగా ఉండడమే..! దీంతో నాయకులు ఏ ఇద్దరు కలిసినా.. నీ ఇలాకాలో ఏం జరుగుతోంది ? ప్లస్సా.. మైనస్సా.. అనే చర్చ చేస్తున్నారు. అంతేకాదు.. నిఘాపైనా చర్చించుకుంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజానాడితో పాటు.. నియోజకవర్గాల్లో పరిస్థితి. సామాజిక వర్గాల సమీకరణలు ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలని.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండానే నియోజకవర్గాలపై నిఘా పెట్టారు. అది ప్రశాంత్ కిశోర్ టీం అని పైకి ప్రచారం ఉన్నప్పటికీ.. వలంటీర్లే.. నిఘాగా వ్యవహరిస్తున్నారని.. ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. దీంతో వలంటీర్ల విషయంలో ఒకప్పుడు జోక్యం చేసుకున్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు మౌనంగా ఉంటున్నారు.
ఎందుకంటే.. తామేమన్నా.. జోక్యం చేసుకుంటే.. నెగిటివ్ రిపోర్ట్ ఇస్తారేమో ? అనివారు మదన పడుతు న్నారు. దీంతో ఇప్పుడు వలంటీర్లదే రాష్ట్రంలో ఆధిపత్యం అనేలా పరిస్థితి నడుస్తోంది. ఎక్కడికక్కడ వలంటీర్లు చెప్పినట్టే నడుస్తోందట. దీంతో ఎమ్మెల్యేల మాట కన్నా.. ప్రజలు వలంటీర్లకే తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. తమకు అందుబాటులో ఉంటున్నవారినే.. ఎమ్మెల్యేలుగా భావిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చర్యల వల్ల ఎమ్మెల్యేలు ప్రజల్లో డమ్మీలు అయిపోతున్నారు.
ఈ పరిస్థితిని ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు.. జిల్లా ఇంచార్జ్ మంత్రులకు ఫిర్యాదు చేశారు. అయితే.. వారు కూడా అధిష్టానం ఆదేశాలు ఎలా ఉంటే అలాగే జరుగుతుందని.. తమ ప్రమేయం ఏమీ లేదేని.. చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు.. ఎమ్మెల్యేలు కూడా వలంటీర్లంటే.. వణుకుతున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.