కేసీఆర్ అంత తొందరపడబోతున్నాడా?

కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్యానిక్ సిచువేషన్లో ఉన్న జనాల్లో ధైర్యం నింపడానికి, అలాగే లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న జనానికి ప్రభుత్వం మీద ఆగ్రహం పెరగకుండా ఉండటానికి తరచుగా ప్రెస్ మీట్లు పెట్టి మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ తర్వాత ఆయన మళ్లీ అంతగా మీడియా ముఖం చూసింది లేదు. ఏవైనా ఎన్నికల్లాంటివి వస్తే బహిరంగ సభల్లో పాల్గొన్నారు కానీ.. ప్రెస్ మీట్లకు హాజరు కాలేదు.

ఐతే హుజూరాబాద్ ఎన్నికల్లో పరాభవం చవిచూశాక కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం అందరి దృష్టినీ ఆకర్షించింది. హుజూరాబాద్ ఫలితం కేసీఆర్‌లో అహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించిందని ఈ ప్రెస్ మీట్లో స్పష్టంగా కనిపించింది. ఇంకా ఈ ప్రెస్ మీట్లో కేసీఆర్ వ్యవహార శైలి, ఆయన వ్యాఖ్యల పట్ల ఎవరికి వాళ్లు రకరకాల భాష్యాలు తీస్తున్నారు.

కాగా దుబ్బాక ఎమ్మెల్యే, భాజపా కీలక నేతల్లో ఒకరైన రఘునందనరావు ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రెస్ మీట్‌ విషయంలో ఆసక్తికర విశ్లేషణ చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు అనేక అర్థాలుంటాయని.. ఆయన తాజా ప్రెస్ మీట్ ఉద్దేశాలే వేరని ఆయన వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ ఓటమి నేపథ్యంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికల ఆలోచన చేస్తుండొచ్చని.. ఈసారి ముందస్తు గత పర్యాయంలా ఆరు నెలలుండదని.. షెడ్యూల్ కంటే ఏడాది 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని ఆయనన్నారు.

హుజూరాబాద్‌లో గెలిచిన ఈటల రాజేందర్ ఊరుకోవట్లేదని, కొందరు కీలక నేతల్ని భాజపాలోకి తీసుకెళ్లబోతోందని కేసీఆర్‌కు తెలుస్తోందని.. హుజూరాబాద్ ఓటమి నేపథ్యంలో తన పనైపోయిందని, ప్రజల్లో తన పట్ల వ్యతిరేకత పెరిగిపోతోందని కేసీఆర్‌కు అర్థమైందని, ఈ నేపథ్యంలో బండి సంజయో ఇంకొకరో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారని.. అప్పుడు కేసీఆర్ సవాలును స్వీకరిస్తూ అసెంబ్లీని రద్దు చేసినా చేసేస్తాడని రఘునందనరావు అభిప్రాయపడ్డారు.

ఫిబ్రవరి-మార్చిలో యూపీ ఎన్నికలతో పాటే తెలంగాణలో ఎన్నికలు జరిపించడానికి కేసీఆర్ వెనుకాడడని.. ఆ దిశగా ఇప్పటికే పార్టీ నాయకులకు సంకేతాలు కూడా వెళ్లాయని.. వాళ్లకు కావాల్సినంత డబ్బులిచ్చి ఎన్నికలకు రెడీ చేస్తున్నాడని.. ఇలా ఎవ్వరూ ఊహించని విధంగా ముందస్తుకు వెళ్లడం ద్వారా ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధం కాక అయోమయ స్థితిని ఎదుర్కొంటాయని.. రోజులు గడిచేకొద్దీ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందన్న ఉద్దేశంతో కేసీఆర్ ఇలా చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని రఘనందనరావు విశ్లేషించడం గమనార్హం.