హుజూరాబాద్ తొలి ఫలితం..

అందరూ ఎంతో ఆసక్తిగా.. ఉత్కంటతో ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు వస్తున్నాయి. తెలంగాణ అధికారపక్షం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల్లో విజయం ఖాయమని భావిస్తున్న వేళ.. ఎగ్జిట్ పోల్స్ అందుకు భిన్నమైన మాట చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అందులో కారు జోరు స్పష్టంగా కనిపించింది.

మొత్తం 753పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు టీఆర్ఎస్ కు 503 ఓట్లు.. బీజేపీకి 159 ఓట్లు రాగా.. కాంగ్రెస్ కు 35 ఓట్లు పోల్ అయ్యాయి. 14 ఓట్లు చెల్లనట్లుగా తేల్చారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అనంతరం తొలి రౌండ్ ఈవీఎంల కౌంటింగ్ మొదలైంది. మొత్తం 22 రౌండ్లలో జరిగే ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ మాత్రం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు అనుకూలంగా వచ్చింది.

మొదటి రౌండ్ హుజూరాబాద్ పట్టణానికి సంబంధించింది కావటం.. ఇక్కడ టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీతో పాటు.. భారీ అధిక్యత రావటానికి అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అలాంటి చోట్ల జరిగిన ఓట్ల లెక్కింపులో 166 ఓట్ల అధిక్యత లభించటం ఆసక్తికరంగా మారింది. తొలి రౌండ్ లోని మొత్తం ఓట్లలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 4610 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థికి మాత్రం 4444 ఓట్లు లభించాయి. దీంతో.. 166 ఓట్ల అధిక్యత ఈటల రాజేందర్ కు వచ్చినట్లైంది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుంటే.. 442 ఓట్ల అధ్యిక్యత ఉంది. ఇందులో మొదటి రౌండ్ లో ఈటలకు వచ్చిన 166 ఓట్ల అధిక్యతను తీసుకున్నా.. టీఆర్ఎస్ అభ్యర్థి స్వల్ప అధిక్యతలో ఉన్నట్లే చెప్పాలి. అయితే.. సెకండ్ రౌండ్ లో వచ్చే అధిక్యతతో స్పష్టత రావటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. మొదటి రౌండ్ టీఆర్ఎస్ కు ప్రతికూల ఫలితం రావటం అశుభం అన్న మాట కొందరి నోట వినిపిస్తుండటం గమనార్హం.