‘విశాఖ ఉక్కు’ పవన్ సినిమా ఫ్లాప్

విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా గ‌ళం విప్పిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా విశాఖ ప‌ట్నం స్టీల్ ప్లాంట్ స‌మీపంలో జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ప‌వ‌న్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా విశాఖ ఉక్కు క‌ర్మాగారం కోసం పోరాడుతున్న వారికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. తాను అండ‌గా ఉంటాన‌ని.. ఎవ‌రూ ధైర్యం వీడ‌రాద‌ని ప్ర‌క‌టించారు. అంద‌రూ క‌లిసి క‌ట్టుగా ఉంటేనే ఏదైనా సాధ్య‌మ‌వుతుంద‌ని అన్నారు. అంతేకాదు.. ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం కూడా ఎవ‌రూ క‌లిసి రాక‌పోవ‌డం వ‌ల్లే.. వ‌దిలేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు. క‌నీసం విశాఖ ఉక్కునైనా కాపాడుకుందామ‌ని అన్నారు.

అదేస‌మ‌యంలో విశాఖ ఎంపీ స‌హా వైసీపీ ఎంపీలు.. ఎవ‌రూ పార్ల‌మెంటులో ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌పై గ‌ట్టిగా నిల‌దీయ‌లేద‌ని.. చెప్పారు. కేవ‌లం టిప్ టాప్ గా వెళ్లి క‌ప్పు కాఫీ తాగేందుకు ప్రాధాన్యం ఇచ్చార‌ని విమ‌ర్శించారు. 22 మంది ఎంపీలు ఎందుకు ఉన్నార‌ని.. రాష్ట్ర స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోన‌ప్పుడు.. వారు ఉండి ప్ర‌యోజ‌నం ఏంట‌ని ప్ర‌శ్నించారు. అదే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి.. పార్ల‌మెంటుకు మ‌రో లేఖ పంపించార‌ని.. దుయ్య‌బ‌ట్టారు. కేంద్రానికి లేఖ‌లు రాశామంటున్న వైసీపీ.. ఎందుకు మౌనంగా ఉంటోంద‌ని నిల‌దీశారు. పాద‌యాత్ర‌లు, మ‌హాపాద‌యాత్ర‌లు చేస్తామ‌ని చెబుతున్న ఈ నాయ‌కులు.. ఇప్ప‌టివ‌ర‌కు ఒక‌గ‌బెట్టింది ఏంట‌ని? ప్ర‌శ్నించారు.

అయితే.. ప‌వ‌న్ ప్ర‌సంగాన్ని నిశితంగా గ‌మ‌నించిన నెటిజ‌న్లు.. ఆయ‌న వైఖ‌రిపై ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తం 50 నిముషాల ప్ర‌సంగంలో వైసీపీని విమ‌ర్శించేందుకు ఆయ‌న బాగానే ప్రాధాన్యం ఇచ్చార‌ని.. కానీ, అస‌లు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌కు ప‌ట్టుబ‌డుతున్న కేంద్రం పైనా.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీపైనా.. బీజేపీ నాయ‌కుల‌పైనా.. ఒక్క మాట కూడా ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని? అంటున్నారు. అంతేకాదు.. అస‌లు ఈ ఉద్య‌మానికి బీజం ప‌డిందే.. హ‌స్తిన‌లో అని.. మ‌రి కేంద్రంతో స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని.. త‌న‌కు ఎవ‌రు అయినా.. అప్పాయింట్‌మెంట్లు ఇస్తున్నార‌ని.. చెబుతున్న ప‌వ‌న్‌.. కేంద్రాన్ని ఎందుకు నిల‌దీయ‌లేక పోతున్నార‌ని.. ప్ర‌శ్నించారు.

అదే స‌మ‌యంలో.. వైసీపీ ప్ర‌భుత్వానికి విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ‌కోసం.. 48 గంట‌ల స‌మ‌యం ఇచ్చిన ప‌వ‌న్‌.. మ‌రి ఇదే స‌మ‌యం స‌వాల్‌ను కేంద్రానికి ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. కేవ‌లం 48 గంట‌ల్లో అఖిల ప‌క్షాన్ని పిల‌వాల‌ని.. దీనిపై ప్ర‌క‌ట‌న చేయాల‌ని.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపుతాం.. అని పిలుపునివ్వాల‌ని.. వైసీపీ స‌ర్కారుకు స‌వాల్ రువ్వ‌డం.. బాగానే ఉన్నా.. ఇదే విష‌యంపై తాను ఇప్ప‌టి వ‌ర‌కు చేసింది ఏంటో.. ప‌వ‌న్ చెప్పి ఉంటే బాగుండేద‌ని.. ప‌లువురు నెటిజ‌న్లు వ్యాఖ్యానించారు. మొత్తంగా చూస్తే.. ప‌వ‌న్ వ్యాఖ్య‌లు.. ప్ర‌సంగాలు.. మొత్తంగా వైసీపీని టార్గ‌టె్ చేసేందుకు మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ్డాయ‌ని.. కేంద్రంపై ఎలాంటి వ్యూహంతో ఆయ‌న ముందుకు సాగుతార‌నే విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసిన‌ట్టు ఉంద‌ని.. నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.