అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ పై మ‌ళ్లీ ష‌ర‌తులు.. ఏపీ స‌ర్కారు పంతం వీడ‌దా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని అణిచి వేస్తున్నార‌నే ఆగ్ర‌హంతో దాదాపు రెండేళ్లుగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న ఇక్క‌డి రైతులు.. తాజాగా సోమ‌వారం నుంచి మ‌హాపాద‌యాత్ర‌కు రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తం 45 రోజుల పాటు దీనిని మ‌హా క్ర‌తువుగా ముందుకు తీసుకువెళ్లాల‌ని.. అనుకున్నారు. మొత్తం నాలుగు జిల్లాల మీదుగా … న్యాయ స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు నిర్వ‌హించే పాద‌యాత్ర ద్వారా.. ప్ర‌జ‌ల‌కు రాజ‌ధాని ప్రాధాన్యం వివ‌రించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. దీనికి సంబంధించి ఆది నుంచి ప్ర‌భుత్వం అడ్డు చెబుతున్న విష‌యం తెలిసిందే. ముందుగా .. అనుమ‌తి లేద‌న్న ప్ర‌భుత్వం.. హైకోర్టు ఆదేశాల‌తో దిగివ‌చ్చింది. దీంతో పాద‌యాత్ర‌కు ఏర్పాట్లు చేసుకున్నారు.

కానీ, ఇప్పుడు మ‌రోసారి.. అంటే.. హైకోర్టు పాద‌యాత్ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన త‌ర్వాత‌.. కూడా ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. తాజాగా ఏపీ డీజీపీ గౌతం స‌వాంగ్ 20 ఆంక్ష‌ల‌తో కూడిన హెచ్చ‌రిక‌ను రైతుల జేఏసీ ప్ర‌తినిధుల‌కు అంద‌జేశారు. ఈ ష‌ర‌తుల‌కు అంగీక‌రించాల్సిందేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అదేస‌య‌మంలో.. గుంటూరు రూర‌ల్‌, అర్బ‌న్‌, ప్ర‌కాశం, నెల్లూరు, తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీల‌కు కూడా లేఖలు రాశారు. అయితే.. ఇప్ప‌టికే హైకోర్టు కొన్ని ష‌ర‌తులు విధించిన నేప‌థ్యంలోవాటిని పాటిస్తామ‌ని.. చెప్పిన రైతుల‌కు ఇప్పుడు డీజీపీ మ‌రో 20 నిబంధ‌న‌లు విధించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌భుత్వం ఇలా అణిచివేత‌ల‌కు పాల్ప‌డితే.. తాము ఉద్య‌మాన్ని మ‌రింత తీవ్రం చేస్తామ‌ని అంటున్నారు.

రైతుల పాదయాత్రకు 20 షరతులతో డీజీపీ అనుమతి ఇచ్చారు. హైకోర్టు ఆదేశాల మేరకు పాదయాత్రకు అనుమతిస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు. గుంటూరు అర్బన్‌, రూరల్‌, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి అర్బన్‌ ఏస్పీలకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. రైతుల పాదయాత్రకు పూర్తి బందోబస్తు కల్పించాలని డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.పాదయాత్ర సందర్భంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు, డీజే సౌండ్లు, బహిరంగసభలు నిర్వహించొద్దని డీజీపీ పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండటంతో ఎన్నికల కోడ్‌ పాటించాలని ఆదేశాలు జారీ చేసారు.

రైతుల పాదయాత్రలో 157 మందికి మించి పాల్గొనకూడదని డీజీపీ ఆదేశించారు. రైతుల పాదయాత్ర సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని షరతు విధించారు. ప్రతి రోజు ఉద‌యం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోగా పాదయాత్ర ముగించాలని డీజీపీ సవాంగ్‌ ఆదేశించారు. అంతేకాదు.. మ‌హిళ‌ల‌ను మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కే పాద‌యాత్ర‌కు అనుమ‌తిస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ బాధ్య‌త‌.. జేఏసీదేన‌ని స్ప‌ష్టం చేశారు. జెండా క‌ర్ర‌ల‌కు అనుమ‌తి లేద‌న్నారు. జెండాల‌ను కేవ‌లం చేతుల‌తో ప‌ట్టుకొంటే స‌రిపోతుంద‌ని స‌ల‌హా ఇచ్చారు. అంతేకాదు.. ప‌రుగులు పెట్ట‌డం.. పోలీసుల‌పై దూష‌ణ‌లు చేయ‌డం.. వంటివి చేయ‌రాద‌న్నారు. మ‌రీ ముఖ్యంగా ముఖ్య‌మంత్రి స‌హా ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే ప్ర‌సంగాలు చేయొద్ద‌ని సూచించారు. దీంతో ఈ ష‌ర‌తులు ఏంట‌ని.. రైతులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ష‌ర‌తుల‌పై మ‌రోసారి.. హైకోర్టు కు వెళ్లే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు రైతులు ప్ర‌క‌టించారు.