గత ఎన్నికలో అధికార పార్టీ తరపున పోటీ చేసినప్పటికీ అనూహ్య పరాజయం పాలైన ఆమంచి కృష్ణమోహన్ దశ తిరగబోతుందా? ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు గతంలోనే ఆయనకు జగన్ అభయం ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏపీలో త్వరలో కీలక పదవులు భర్తీ చేయనున్నారు. శాసన మండలిలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాల కోసం సీఎం జగన్ కొంతమంది పేర్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం.. అసెంబ్లీలో బలం ఉండడంతో ఈ 14 ఎమ్మెల్సీ స్థానాలు ఆ పార్టీ ఖాతాలోనే చేరడం ఖాయం. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఇతర నేతలు ఇప్పుడీ పదవులపై ఆశతో ఉన్నారు.
అయితే ఆమంచికి ఎమ్మెల్సీ పదవి దక్కడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గతంలో వరుసగా రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీలో నిలబడ్డా రాష్ట్రమంతా ఫ్యాను గాలి వీచినా టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత బలరాం వైసీపీకి మద్దతు పలకడం ఆమంచికి మరింత ఇబ్బందిగా మారింది.
చీరాలలో ఆమంచి, కరణం మధ్య ఆధిపత్య పోరు సాగుతుండడంతో ఆమంచిని పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు చూసుకోమని జగన్ చెప్పారు. అవకాశం వచ్చినపుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కూడా జగన్ హామీనిచ్చారు. కానీ చీరాలను వదులుకోవడం ఇష్టం లేని ఆమంచి.. జగన్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారనే ప్రచారం సాగుతోంది.
మరోవైపు ఇప్పటికే చీరాల నుంచి పోతుల సునీత మండలిలో ప్రాతినిథ్యం కలిగి ఉంది. ఇక పోతే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితోనూ ఆమంచికి మంచి సఖ్యత లేదు. ఈ నేపథ్యంలో ప్రకాశం నుంచి ఆమంచికి ఎమ్మెల్సీ సీటు దక్కుతుందా? లేదా? అనే అనుమానాలు కలిగాయి. కానీ ఇటీవల ఒంగోలుకు వచ్చిన జగన్.. ఆమంచిని ఎమ్మెల్సీ చేస్తానని అభయం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆమంచి ఎమ్మెల్సీ కావడం ఖాయమేనన్న ప్రచారం జోరందకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates