రాష్ట్రాన్ని ప్రస్తుతం కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉంటే.. అది గంజాయే! తాజాగా తూర్పుగోదావరి సహా.. అనంతపురంలోనూ గంజాయిని పోలీసులు పెద్ద మొత్తంలో పట్టుకున్నారు. అదేసమయంలో పెళ్లి సహా వివిధ శుభకార్యాలకు పిలిచే ఆహ్వాన పత్రికలమాటున కూడా పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఇవన్నీ..ఏపీ కేంద్రంగానే జరుగుతున్నట్టు ఇతర రాష్ట్రాల పోలీసులు మరోసారి కూడా చెప్పారు. అయితే.. ఇంత కీలక విషయంపై కేబినెట్ చర్చిస్తుందని.. అందరూ అనుకున్నారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన కేబినెట్లో ఈ విషయం తప్పకుండా ఉంటుందని అనుకున్నారు.
కానీ, కేబినెట్ అజెండాలో మాత్రం ఈ అంశానికి చోటు లేకపోవడం గమనార్హం. ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో సినిమా టిక్కెట్లను ఆన్లైన్లో ప్రభుత్వం విక్రయించడంపై చర్చిస్తున్నారు. అదేసమయంలో సినిమాటోగ్రఫీ చట్టసవరణపై చర్చించనున్నారు. ఇక, కీలకమైన ఆలయాల్లో భద్రతకు సీసీ కెమెరాలు, ఇతర చర్యలకు ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, ‘ఈడబ్ల్యూఎస్’ కేటగిరిలోని వారి సంక్షేమ కార్యకలాపాలకు ప్రత్యేకంగా ఓ శాఖ ఏర్పాటుపై కేబినెట్లో చర్చించనున్నారు. ఇలా దాదాపు 20 నుంచి 25 అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదముద్ర వేయనుంది.
కానీ, అత్యంత ముఖ్యమైన.. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య దాడులకు, వ్యాఖ్యలకు కేంద్రమైన గంజాయి సహా.. డ్రగ్స్‌పై మాత్రం కేబినెట్ దృష్టి పెట్టకపోవడం గమనార్హం. కానీ, ఇదే రోజు.. మహారాష్ట్రలో.. కేబినెట్ ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జరిగే భేటీలో డ్రగ్స్‌పైనే చర్చించనున్నట్టు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కానీ, రాష్ట్రంలో అనేక వివాదాలకు.. కారణంగా ఉన్న అంశంపై ఏపీ ప్రభుత్వం మాత్రం చర్చించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంటే.. ఇప్పటకే చర్యలు తీసుకున్నామనే సంకేతాలు పంపేస్తున్నారా? లేక.. గంజాయి వంటివాటిపైచర్చిస్తే.. ప్రతిపక్షాలకుమైలేజీ వస్తుందని అనుకున్నారా? అనే ప్రశ్నలు తెరమీదకి వస్తున్నాయి. ఏదేమైనా.. ప్రభుత్వ వైఖరిపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. అదేసమయంలో ఎయిడెడ్ స్కూళ్లపై రాష్ట్ర వ్యాప్తంగా విదద్యార్థుల తల్లిదండ్రులు ఆందోలనలు చేస్తుంటే.. ఆ అంశంపైనా.. ప్రభుత్వం చర్చించకపోవడం గమనార్హం.