దేశంలోని ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించిందనే ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వంపై విచారణ సాధ్యమేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రం దేశంలోనే వందల మంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయిస్తోందనే వార్తలు ఆమధ్య దేశంలో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఫోన్ల ట్యాపింగ్ పై ఎంతమంది కేంద్రాన్ని ప్రశ్నించినా సమాధానం రాలేదు. దాంతో కొందరు జర్నలిస్టులు, సామాజిక ఉద్యమకారులు సుప్రింకోర్టులో కేసులు వేశారు.
ఆ కేసును విచారించిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులిచ్చింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు కేంద్రం సరైన సమాధానాలు చెప్పలేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేయించారా లేదా అని చెప్పమని ఎన్నిసార్లు అడిగినా కేంద్రం సరైన సమాధానం చెప్పలేదు. దాంతోనే ప్రముఖుల మొబైల్ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయన్న విషయం అందరికీ అర్ధమైపోయింది.
తమ ప్రశ్నలకు కేంద్రం స్పష్టమైన సమాధానాలు ఇవ్వకపోవటంతో ఓ స్వతంత్ర సంస్ధతో దర్యాప్తు చేయించాల్సుంటుందని తీవ్రంగానే హెచ్చరించింది. అయినా కేంద్రం పట్టించుకోలేదు. దాంతో అప్పటికి కేసు విచారణను వాయిదా వేసింది. అప్పుడు వాయిదా వేసిన కేసుపై సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు చెప్పనుంది. ఒకవేళ సుప్రీంకోర్టు గనుక స్వతంత్ర సంస్ధతో దర్యాప్తుకు ఆదేశిస్తే సదరు సంస్ధకు కేంద్రం సహకారం అందిస్తుందా అనేది చాలా కీలకం. సుప్రీంకోర్టుకు సరైన సమాధానాలు చెప్పని కేంద్రప్రభుత్వం స్వతంత్ర సంస్థ దర్వాప్తుకు ఏమి సహకరిస్తుంది ?
స్వతంత్ర దర్యాప్తు సంస్థకు కేంద్రం సహకరించకపోతే అప్పుడు సుప్రీంకోర్టు ఏమి చేస్తుంది ? అన్నదే కీలకమైంది. నిజానికి ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ అన్నది పెద్ద నేరం. అయితే దేశరక్షణకు విఘాతం కలుగుతోందని అనుమానించినపుడు, అనుమానిత వ్యక్తుల కదలికలపైనా, ఫోన్లపైనా నిఘా పెట్టడం తప్పు కాదు. అయితే ఆ పని చేయాలంటే అందుకు ఓ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. ఆ ప్రొసీజర్ ను కేంద్రం ఏమాత్రం ఫాలో అవ్వలేదని అర్ధమైపోయింది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే ఏ ప్రభుత్వంలో అయినా అనుమానితుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతునే ఉంటుంది. కానీ ఇపుడు మాత్రం జడ్జీలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, వాళ్ళ పీఏలు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలతో పాటు ఇతర రంగాల్లో ప్రముఖులకు చెందిన కొన్ని వేల ఫోన్లను ఏకకాలంలో ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. ఇక్కడే నరేంద్ర మోడీ సర్కార్ ఆరోపణలకు సమాధానాలు చెప్పుకోలేక అవస్థలు పడుతున్నది. విచిత్రం ఏమిటంటే ట్యాపింగ్ కు గురైన ఫోన్లలో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ఉండటం.