ఆంధ్రప్రదేశ్లో జగన్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తోంది. మరో రెండున్నరేళ్లలో ఎన్నికలకు రంగం సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాష్ట్రంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు అంటి ముట్టనట్లుగా ఉన్న సీనియర్ నాయకులు కూడా ఇప్పుడు తిగిరి రాజకీయ పునఃప్రవేశం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాంటి నాయకుల్లో ప్రధానంగా డీఎల్ రవీంద్రారెడ్డి పేరు ఎక్కువగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించి ఆయన కడప రాజకీయాల్లో వేడి రగిల్చారు. దీంతో మైదుకూరులో ఇప్పుడు జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఆయన ఏ పార్టలో చేరుతారోనని చర్చించుకుంటున్నారు.
1978లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయిన రవీంద్రారెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఆ పార్టీ గుర్తుపై మరో అయిదు సార్లు గెలిచారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణానంతరం జగన్ సీఎం కావాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆయన.. ఆ తర్వాత నల్లారి కిరణ్కుమార్ రెడ్డి కేబినేట్లో చేరారు. కానీ కిరణ్కుమార్ రెడ్డినే బహిరంగంగా విమర్శించిన ఆయన మంత్రి పదవి కోల్పోయారు. 2004, 2009 ఎన్నికల్లో విజయాలు సాధించిన ఆయన.. రాష్ట్ర విభజన తర్వాత ఎన్నికల్లో పోటీచేయలేదు. 2014లో టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్కు మద్దతు తెలిపారు.
2019లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆ ఏడాది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శెట్టిపెల్లి రఘురామిరెడ్డికి అండగా నిలిచారు. కానీ ఆ తర్వాత పార్టీలో తనకు సరైన గుర్తింపు దక్కడం లేదని తన అనుచరులను రాజకీయంగా ఎదగకుండా అడ్డుపడుతున్నారని వైసీపీలో ఉంటూనే ప్రభుత్వ పాలనపై ఆయన రవీంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో ఆ పార్టీతో ఆయనకు బంధం తెగిపోయిందనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడేమో 2024 ఎన్నికల్లో బరిలో దిగుతానని తాజాగా ప్రకటించారు. కానీ ఏ పార్టీ తరపున పోటీ చేస్తారనే దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేదు.
మైదుకూరులో వైసీపీ సీటు ఖాళీగా లేదు. ఇక టీడీపీ నుంచి అక్కడ పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. ఆయన్ని కాదని బాబు.. డీఎల్ రవీంద్రారెడ్డికి ఆ సీటు ఇచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. ఇక మిగిలింది బీజేపీ, జనసేన. ఈ రెండు పార్టీల్లో ఆయన ఏదో ఒకదాంట్లో చేరే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మరోసారి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన బరిలో దిగినా ఆశ్చర్యపోనవసరం లేదని మరో వర్గం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో డీఎల్ ఏ పార్టీలో చేరతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates