భ‌ట్టి పై కేటీఆర్ క‌న్ను!

తెలంగాణ‌లో రాజ‌కీయం గ‌తంలో ఉన్న‌ట్లు లేదు. ప‌రిస్థితులు మారాయి. 2014లో రాష్ట్రం ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి అధికార టీఆర్ఎస్ ఆడింది ఆట‌గా సాగింది. కానీ గ‌త రెండేళ్లుగా ఆ ప‌రిస్థితుల్లో మార్పు వ‌చ్చింది. ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో త్రిముఖ పోరు నెల‌కొంది. టీఆర్ఎస్‌కు దీటుగా నిల‌బ‌డుతూ బీజేపీ, కాంగ్రెస్ స‌వాలు విసురుతున్నాయి.

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత బండి సంజ‌య్ దూకుడుతో టీఆర్ఎస్‌ను ఇబ్బందులు పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. ఇక తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికైన త‌ర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ బ‌లంగా పుంజుకుంది. దీంతో రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ మూడు పార్టీల మ‌ధ్య పోటీ ఉండే అవ‌కాశం ఉంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

2014 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత ప్ర‌త్య‌ర్థి పార్టీల నుంచి కీల‌క నాయ‌కుల‌ను టీఆర్ఎస్‌లో చేర్చుకున్న కేసీఆర్‌.. త‌న‌కు ఎదురు లేకుండా చేసుకున్నారు. కానీ ఇటీవ‌ల ప‌రిస్థితులు మ‌ళ్లీ ప్ర‌తికూలంగా మారుతుండ‌డంతో టీఆర్ఎస్ మ‌రోసారి అదే వ్యూహాన్ని అనుస‌రించ‌నుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ సారి టీఆర్ఎస్ వ‌ర్కింట్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌.. ఆ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పుంజుకుంటున్న కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు ఆయ‌న అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న భ‌ట్టి విక్ర‌మార్క‌ను గులాబి గూటికి చేర్చేందుకు కేటీఆర్ ప్రయత్నాలు మొద‌లెట్టార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల భ‌ట్టి విక్ర‌మార్క‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు అందుకు బ‌లాన్ని చేకూరుస్తున్నాయ‌ని విశ్లేష‌కులు అనుకుంటున్నారు.

ప్ర‌స్తుతం కాంగ్రెస్ సీఎల్పీ నేత‌గా ఉన్న భ‌ట్టి విక్ర‌మార్క ఆ పార్టీలో మంచి వ్య‌క్తి అని కానీ అక్క‌డ గ‌ట్టి అక్ర‌మార్కుల మాటే చెల్లుబాటు అవుతోంద‌ని ఇటీవ‌ల విలేక‌ర్ల స‌మావేశంలో కేటీఆర్ అన్నారు. దీంతో భట్టి విక్ర‌మార్క విష‌యంలో టీఆర్ఎస్ మంచి అభిప్రాయంతోనే ఉంద‌ని ఆయ‌న్ని త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌నే ఊహాగానాలు జోరందుకున్నాయి. భ‌ట్టిపై టీఆర్ఎస్ ఇంత‌లా ఆస‌క్తి చూపించ‌డానికి మ‌రో కార‌ణం కూడా ఉంది. ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఏమంత బ‌లంగా లేదు.

పైగా మ‌ధిర‌లో ప‌రిస్థితి కూడా అంతంత‌మాత్ర‌మే. ఈ నేప‌థ్యంలో భ‌ట్టి విక్ర‌మార్క పార్టీలోకి వ‌స్తే మ‌ధిర‌తో పాటు ఖ‌మ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు బ‌లం వ‌స్తుంద‌ని కేటీఆర్ ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ మిన‌హా రాష్ట్రవ్యాప్తంగా ద‌ళిత బంధు అమ‌లు చేయ‌నున్న నాలుగు మండ‌లాల్లో ఒక‌టి భ‌ట్టి విక్ర‌మార్క ప్రాతినిథ్యం వ‌హిస్తున్న మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో ఉంది. దీంతో భ‌ట్టిని దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టేందుకు టీఆర్ఎస్ ప‌న్నిన వ్యూహం బాగానే ఉంది కానీ భ‌ట్టి కారెక్కుతారా? అన్న‌ది మాత్రం సందేహ‌మేన‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.