ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టుల్లో సవాలు చేయడం, న్యాయస్థానాల ద్వారా అడ్డుకోవటమే ఏకైక లక్ష్యంగా కొందరు వ్యక్తులు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి వ్యక్తులు, పార్టీల సంగతి ఎలాగున్నా అధికార వైసీపీలో తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా ప్రభుత్వాన్ని అడ్డుకోవటమే పనిగా పెట్టుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన వేసిన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కోర్టు దుమ్ముదులిపేసింది. కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు తిరుగుబాటు ఎంపీ లాయర్ సమాధానం చెప్పలేకపోయారు.
ఇంతకీ విషయం ఏమిటంటే పాల ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తిదారులకు అధిక ధరలు ఇప్పింటచమే లక్ష్యంగా ప్రభుత్వం గుజరాత్ లోని అమూల్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నది. తమ ఒప్పందంలో ఇప్పటికే మూతపడిన పాల ఫ్యాక్టరీలను పునరుద్ధరించడం కూడా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఆస్తులను అముల్ సంస్ధకు బదిలీచేసింది. ఈ బదిలీ కూడా కేవలం లీజు ప్రాతిపదికన మాత్రమే జరిగింది.
ఎప్పుడైతే ఒప్పందాలు జరిగాయో లేదో వెంటనే తిరుగుబాటు ఎంపీ ప్రభుత్వ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణ సందర్భంగానే చీఫ్ జస్టిస్ కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏమిటంటు నిలదీశారు. ‘అమూల్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మీరు ఏ విధంగా నష్టపోతారో చెప్పాలని అడిగారు. ఫలానా విధంగానా ప్రభుత్వం వ్యవహరించుకోవాలని, నడుచుకోవాలని మీరు ఎలా ప్రభుత్వాన్ని శాసిస్తారంటు నిలదీశారు. ప్రభుత్వం ఎవరితో ఎలాంటి ఒప్పందం చేసుకోవాలో కూడా మీరే నిర్దేశిస్తారా ? అంటూ ప్రశ్నించారు. ఎవరితో ఎలాంటి ఒప్పందాలో చేసుకోవాలో పూర్తిగా ప్రభుత్వ ఇష్టమని తేల్చిచెప్పారు.
వ్యక్తులు, రాజకీయ పార్టీల ఆలోచనల ప్రకారం వేసే కేసులను న్యాయస్ధానాలు పరిష్కరించవని స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వాలు చేసుకునే ఒప్పందాలు చట్టప్రకారం జరిగిందా లేదా ? రాజ్యాంగానికి లోబడి ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రమే కోర్టులు చూస్తాయని స్పష్టం చేశారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా రఘురామ ప్రభుత్వాన్ని కోర్టుకు ఈడ్చి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అందుకనే ప్రతి విషయాన్ని కోర్టులో చాలెంజ్ చేస్తున్నారు.
జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని వేసిన కేసు కూడా ఇందులో భాగమే. జగన్ కేసులకు ఎంపీకి ఎలాంటి సంబంధం లేదు. అయినా కావాలనే సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలతో కోర్టులో కేసు వేశారు. చివరకు ఆ కేసును సీబీఐ కోర్టు కొట్టేయగానే వెంటనే హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. మరి తాజాగా చీఫ్ జస్టిస్ సంధించిన ప్రశ్నలకు ఎంపి తరపు లాయర్ ఏమి సమాధానాలు చెబుతారో చూడాలి.