చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల కేసీఆర్ తో పాటు కాంగ్రెస్, బీజేపీలను కూడా టార్గెట్ చేయటమే విచిత్రంగా ఉంది. మామూలుగా అయితే ఏ ప్రతిపక్షమైనా అధికారంలో ఉన్న పార్టీనే టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే సహచర ప్రతిపక్షాలను ఎంత టార్గెట్ చేసినా ఉపయోగం ఉండదు కాబట్టి. ఏవైనా ఆరోపణలు చేయాలన్నా, విమర్శలు చేయాలన్నా అధికార పార్టీ పైన చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవినీతి అయినా, అధికార దుర్వినియోగ మైనా అధికార పార్టీకే అవకాశం ఉంటుంది.
ఈ విషయాలన్నింటినీ వదిలేసి పాదయాత్ర ప్రారంభ సమయంలో ఒకవైపు కేసీఆర్ పై ఆరోపణలు చేసిన షర్మిల అదే ఊపులో రేవంత్ రెడ్డి, బీజేపీ పైన కూడా విమర్శలు చేయడమే ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ గురించి మాట్లాడుతూ ఒక బ్లాక్ మెయిలర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరువు తెచ్చుకున్న రేవంత్ లా బ్లాక్ మెయిల్ చేయడం తనకు చేతకాదని షర్మిల చెప్పటమే విచిత్రంగా ఉంది. రేవంత్ ఎవరిని బ్లాక్ మెయిల్ చేశారు అన్న విషయాన్ని మాత్రం షర్మిల చెప్పలేదు.
ఒకరి మీద ఆరోపణలు చేసినప్పుడు దానికి ఆధారాలను చూపించాల్సిన బాధ్యత కూడా ఆరోపణలు చేసిన వారి మీదే ఉంటుంది. కేవలం ఆరోపణలు చేసేసి చేతులు దులిపేసుకుంటానంటే జనాలు నమ్మరు. ప్రజా ప్రతినిధుల అమ్మకాలు, కొనుగోళ్ళు తనకు చేతకాదన్నారు. అంటే రేవంత్ గతంలో తగులుకున్న ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. అలాగే కేసీయార్ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్న బీజేపీ కేసీఆర్ అవినీతిపై ఎందుకని విచారణ చేయించటం లేదని నిలదీశారు.
రాష్ట్రంలో సమస్యలు లేవని కేసీఆర్ చెబితే తన ముక్కును నేలకు రాస్తానని చెప్పటం కూడా విచిత్రంగా ఉంది. రాష్ట్రంలో సమస్యలు లేవని ఎవరన్నారు ? దేశంలో సమస్యలు లేని రాష్ట్రమంటూ ఏదైనా ఉందా అసలు. ఇక్కడ షర్మిల మర్చిపోయిన విషయం ఏమిటంటే తన పార్టీ వైఎస్సార్టీపీకి జనాల్లో ఆదరణ లేదు. ఇపుడు మొదలుపెట్టిన పాదయాత్ర కూడా కేవలం ఉనికిని చాటటం కోసమే అని అందరికీ తెలుసు. అలాంటపుడు ఏకకాలంలో మూడు పార్టీలను టార్గెట్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు.
కాంగ్రెస్, బీజేపీలు కేసీయార్ ను టార్గెట్ చేస్తుంటే షర్మిల మాత్రం మూడు పార్టీలను టార్గెట్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. ఇలాగే పవన్ కళ్యాణ్ ఏపీలో 2014-19 మధ్య అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడును టార్గెట్ చేయటం మానేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. దీనివల్లే చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకుని పనిచేస్తున్నారనే ముద్రపడిపోయింది. ఆ ముద్ర ఫలితం 2019 ఎన్నికల్లో జనసేనపై ఎలాంటి ప్రభావం పడిందో తెలిసిందే. కాబట్టి ఇపుడు షర్మిల కూడా ఉపయోగం లేని ప్రతిపక్షాలను కాకుండా కేసీయార్ ను టార్గెట్ చేస్తే ఏమన్నా ఉపయోగం ఉంటుందేమో ఆలోచించాలి.