మంగళవారం ఆంధ్రప్రదేశ్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరిగాయి. ఇవి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల పనే అన్నది స్పష్టం. టీడీపీ నేత పట్టాభిరామ్.. సీఎం జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో అందుకు ప్రతిస్పందనగానే ఈ దాడులు జరిగినట్లుగా భావిస్తున్నారు.
ఐతే ఈ దాడులతో తమకేం సంబంధం లేదన్నట్లుగా కొందరు వైకాపా నేతలు మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. టీడీపీ వాళ్లే తమ మీద తామే దాడి చేసుకుని నిందను వైకాపా మీద నెట్టాలని చూసినట్లుగా కూడా కొందరు ఆరోపణలు చేశారు. ఐతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అలాంటి వ్యాఖ్యలేమీ చేయలేదు. దాడులు తన అభిమానుల పనే అని పరోక్షంగా ఒప్పేసుకున్నారు.
టీడీపీపై కార్యాలయాలు, వాటి సిబ్బందిపై జరిగిన దాడి జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో జగన్ వన్ వే ప్రెస్ మీట్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తననుద్దేశించి టీడీపీ నేతల దూషణలకు బదులుగానే ఈ దాడులు జరిగి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా ప్రతిపక్షంలో ఉన్నానని.. ఎప్పుడూ కూడా ఇలాంటి దూషణలు చేయలేదని, తమ పార్టీ నేతలు కూడా ఇలా మాట్లాడేవాళ్లు కాదని.. కానీ ప్రస్తుతం టీడీపీ నేతలు మాత్రం పత్రికల్లో ఎక్కడా రాయలేని విధంగా దారుణమైన బూతులు ప్రయోగిస్తున్నారని.. తనను ఎవరైనా తిడితే తన అభిమానులకు బీపీ వస్తుందని.. ఈ క్రమంలోనే టీవీల్లో టీడీపీ నేతల బూతులు విని తట్టుకోలేక కొన్ని చోట్ల తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు తమ ఆగ్రహాన్ని చూపించే ప్రయత్నం చేసి ఉంటారని జగన్ అభిప్రాయపడ్డారు.
తాము అందిస్తున్న పథకాల వల్ల పేదవాళ్లకు మంచి జరిగి ఎక్కడ తనకు మంచి పేరు వచ్చేస్తుందో అన్న అక్కసుతో ఆయా పథకాలను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని, కోర్టుల్లో కేసులు వేసి పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates