బద్వేలులో ఆసక్తికరమైన చర్చ

ఇపుడిదే ప్రశ్నపై చర్చలు జోరుగా సాగుతోంది. బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ఈనెల 30వ తేదీన జరగబోతోందన్న విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికకు దూరంగా ఉండిపోయింది. ఒకపుడు టీడీపీకి మంచి ఓటు బ్యాంకే ఉంది. కానీ తర్వాత కాంగ్రెస్ ఇపుడు వైసీపీ ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

నిజానికి ఈ ఎన్నికలో టీడీపీ పోటీ చేసినా చేయకపోయినా రిజల్టు ఒకటేలాగ ఉంటుందనటంలో సందేహంలేదు. ఎందుకంటే బద్వేలులో రిజల్ట్ వైసీపీకి ఏకపక్షంగా ఉంటుందని అందరికీ తెలిసిందే. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్ధులకు డిపాజిట్లు వస్తే చాలా ఎక్కువనే ప్రచారం అందరికీ తెలిసిందే. బహుశా నిజం కూడా అదే కావచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి 2337 ఓట్లొచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్లు మరీ అధ్వాన్నం 750.

ఇలాంటి నేపథ్యంలో టీడీపీ ఓట్లు ఎవరికి పడతాయి అన్న వియంపైనే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పోటీలో ఎలాగూ టీడీపీ లేదు కాబట్టి మరి దాని ఓట్లు ఎవరికి పడతాయి ? కాంగ్రెస్ కు లేదా బీజేపీ అభ్యర్థుల్లో ఎవరికైనా ఓట్లు వేయిస్తుందా ? లేకపోతే పోటీకి దూరంగా ఉన్నట్లే ఓటింగుకు కూడా దూరంగా ఉండమని ఆదేశిస్తుందా ? ఒకవేళ అలా చెబితే ఓటింగ్ కు టీడీపీ నేతలు, శ్రేణులు దూరంగా ఉంటారా ? అన్నదే అసలైన సమస్య.

మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన దివంగత ఎంఎల్ఏ జీ వెంకటసుబ్బయ్యకు 95,482 ఓట్లొచ్చాయి. టీడీపీ తరపున పోటీచేసిన ఓబుళాపురం రాజశేఖర్ కు 50748 ఓట్లు వచ్చాయి. అంటే వైసీపీ అభ్యర్థికి 45 వేల మెజారిటి వచ్చింది. వైసీపీకి అంత మెజారిటి వచ్చినా టీడీపీకి కూడా 50 వేల ఓట్లు వచ్చిన విషయాన్ని మరచిపోకూడదు. మరిపుడా 50 వేల ఓట్లు ఎవరికి పడతాయో చూడాలి.

ఒకవేళ జనసేన అభ్యర్థి పోటీలో ఉండుంటే టీడీపీ ఓట్లు ఆ పార్టీకి పడతాయేమో అనే అంచనా ఉండేది. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారం తెలిసిందే. మొన్నటి పరిషత్ ఎన్నికలకు సంబంధించి 8 మండలాల్లో రెండుపార్టీలు కలిసిపోయాయి. రేపటి పొత్తుకు నిన్నటి కలయితే ఒక ట్రయిలర్ అనే అందరు అనుకుంటున్నారు. కాబట్టే జనసేనకు టీడీపీ ఓట్లు పడినా ఆశ్చర్యపోవక్కర్లేదు. కానీ ఇపుడు పోటీలో జనసేన కాకుండా మిత్రపక్షం బీజేపీ అభ్యర్ధి ఉన్నారు. కాబట్టి టీడీపీ ఓట్లు ఎవరికైనా వేయిస్తారా లేకపోతే ఇష్టం వచ్చిన వాళ్ళకు వేసుకోమని ఫ్రీగా వదిలేస్తారా చూడాలి.