ఏపీలో విద్యుత్ సంక్షోభం.. కారణం చెప్పిన ట్రాన్స్ కో

భారత్ కు తీవ్రమైన విద్యుత్ సంక్షోభం పొంచి ఉందనే మాట ఇటీవల వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చెప్పినంత ఎక్కువగా ఏమీ కొరత లేదన్న మాటను ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. అందులో నిజం లేదన్న మాట తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే అర్థం కాక మానదు. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణ కంటే ఏపీకే విద్యుత్ సంక్షోభం ఎక్కువగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి బలం చేకూరేలా తాజాగా ఏపీ ట్రాన్స్ కో చేసిన ప్రకటన స్పస్టం చేస్తోంది.

రాష్ట్రంలో బొగ్గు కొరత ఉన్నప్పటికీ.. విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేలా డిస్కింలు పని చేస్తున్ట్లుగా ఏపీ ట్రాన్స్ కో చెప్పింది. ఈ మాట విన్నంతనే ఫర్లేదన్న భావన కలిగినప్పటికి.. సదరు సంస్థ చెబుతున్న లెక్కల్ని చూస్తే మాత్రం.. ముంచుకొస్తున్న సంక్షోభం స్పష్టంగా కనిపించక మానదు. బొగ్గు కొరత కారణంగా ఏపీలో 2500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాయని చెబుతున్నారు.

ఏపీ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుండగా.. కొరత కారణంగా సెప్టెంబరులో 24వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యాయని పేర్కొన్నారు. దీంతో విద్యుదుత్పత్తి మీద కూడా ప్రభావం పడింది. ప్రస్తుతం నెలకొన్న బొగ్గు కొరత కారణంగా తక్కువ స్థాయి విద్యుత్ అంతరాయాలతో సరఫరా చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. నిరంతర సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న వేళలో ఒక్కో యూనిట్ కు రూ.15-20 పెట్టి మరీ విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు.

ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 18,533 మెగావాట్లు అయినప్పటికీ.. సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని చెబుతున్నారు. 8075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నా బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావడం లేదని.. 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి 100 మెగావాట్లు మాత్రమే వస్తుందని వెల్లడించింది. ప్రస్తుతం ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. పీక్ డిమాండ్ మేరకు 9064 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందన్నారు.