ఇంటిని చంద్రబాబు చక్కదిద్దుకుంటున్నారా ?

మూడు రోజుల చంద్రబాబునాయుడు కుప్పం పర్యటన చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నిజానికి ఈ పర్యటన 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే చేసుండాలి. కానీ అప్పట్లో నియోజకవర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదే సమయంలో కరోనా వైరస్ సమస్య కూడా మొదలవ్వటం తో పూర్తిగా ఇంటికే పరిమితమైపోయారు. కరోనా దెబ్బకు దాదాపు రెండేళ్లకు పైగా చంద్రబాబు బయట తిరగలేకపోయారు. ఏదో పార్టీ అవసరార్ధం నేతలను పరామర్శించటం తప్ప పార్టీ కార్యక్రమాలకు చంద్రబాబు బయటతిరిగింది పెద్దగా లేదనే చెప్పాలి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కుప్పంలో మూడు రోజుల పర్యటన అన్నది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాంటిదే. ఎలాగంటే జరగాల్సిన ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు తీరిగ్గా కుప్పంలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన పెట్టుకున్నారు. పంచాయితి ఎన్నికలైనా, మున్సిపాలిటి, పరిషత్ ఎన్నికల్లో అయినా టీడీపీ బాగా దెబ్బతిన్నది. గడచిన 30 ఏళ్ళలో ఏ ఎన్నికలో అయినా టీడీపీకి ఇంతటి అధ్వాన్న ఫలితాలు ఎదురుకాలేదన్నది వాస్తవం.

దీనికి ప్రధాన కారణం ఏమిటంటే చంద్రబాబు అనే చెప్పాలి. అధికారంలో ఉన్నపుడేమో నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. పెత్తనమంతా పీఏపైన నేతలపైన వదిలేశారు. వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా చెలాయించుకున్నారు. దాంతో పార్టీకి కమిటెడ్ నేతలు, కార్యకర్తలతో బాగా గ్యాప్ వచ్చేసింది. నియోజకవర్గంలో పార్టీకి నిజమైన క్యాడర్ కు జరుగుతున్న అన్యాయాన్ని చంద్రబాబుతో చెప్పాలని ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు.

చంద్రబాబే కాదు చివరకు నారా లోకేష్ కూడా పార్టీకి కమిటెడ్ గా పనిచేసిన వారిని ఎవరినీ దగ్గరకు రానీయలేదని చర్చ నడుస్తోంది. దాంతో విసిగిపోయిన నేతలు, క్యాడర్ సరిగ్గా 2019 ఎన్నికల సమయానికి మొహం చాటేశారు. దాంతోనే చంద్రబాబుకు మొదటి దెబ్బ పడింది. మొదటి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనకబడటం అన్నది 1989 నుంచి ఎప్పుడూ జరగలేదు. అప్పుడైనా చంద్రబాబు మేల్కొనలేదు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కుప్పం అభివృద్ధిపై ప్రత్యేకమైన దృష్టిపెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించటంతో మంత్రి ముందు టీడీపీని దెబ్బకొట్టే పని మొదలుపెట్టారు.

టీడీపీలో అసంతృప్తులందరినీ వైసీపీలోకి లాగేశారు. ప్రతి మండలంలోను కమిటెడ్ నేతలను, క్యాడర్ ను లాగేయటంతో పంచాయితి ఎన్నికల్లో టీడీపీ సానుభూతిపరులు దాదాపు ఓడిపోయారు. తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే రిజల్ట్ రిపీటయ్యింది. చివరకు పరిషత్ ఎన్నికల్లో డైరెక్టుగానే వైసీపీకి బాహాటంగా మద్దతు పలికారు. దాంతో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది.

ఇదే సమయంలో పరిషత్ ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో పర్యటించినపుడు జూనియర్ ఎన్టీయార్ కు జిందాబాద్ లు కొట్టడం చంద్రబాబుకు ఇబ్బందైంది. ఇలాంటి అనేక ఘటనల తర్వాత ఇపుడు చంద్రబాబు తీరిగ్గా నియోజకవర్గం పర్యటన పెట్టుకున్నారు. దీనివల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబుకు అయినా పార్టీకి అయినా జరిగే ఉపయోగం ఏమీ లేదనే చెప్పాలి. పార్టీ నేతలతో తాను మాట్లాడటం కాకుండా మిగిలి ఉన్న నేతలు, క్యాడర్ మాట్లాడితే చంద్రబాబు వినాలి. అప్పుడే పార్టీలోని లోపాలేంటో తెలుసుకోలుగుతారు లేకపోతే అంతే సంగతులు.