కాపు కాయడానికి ప‌వ‌న్ ప్ర‌య‌త్నాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటి చేసి దారుణ ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం ప్లాన్ మార్చిన‌ట్లే క‌నిపిస్తున్నారు. ఈ మ‌ధ్య ఆయ‌న కాపు జ‌పం ఎత్తుకోవ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ నిపుణులు అనుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంత కాపు సామాజిక వ‌ర్గం మ‌ద్ద‌తుతో మెరుగైన ఫ‌లితాలు సాధించేందుకు ఇప్ప‌టి నుంచే ఆయ‌న ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. కాపు నేత అనే పేరును వాడుకుని వ‌చ్చే ఎన్నిక‌లకు వెళ్లాల‌నేది ఆయ‌న వ్యూహంగా తెలుస్తోంది.

రిప‌బ్లిక్ సినిమా ప్రి రిలీజ్ వేడుక‌లో కాపు రిజ‌ర్వేష‌న్ల‌పై ప్ర‌భుత్వం ఎందుకు అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని విమ‌ర్శ‌లు చేసి సామాజిక వ‌ర్గం పేరెత్తుకున్న ప‌వ‌న్‌.. దాన్ని మ‌రింత స‌మ‌ర్థంగా ఉప‌యోగించుకోవాల‌ని అనుకుంటున్నారు. అందుకే రాష్ట్రంలోని కాపుల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టారు. జిల్లాల వారీగా కాపుల‌తో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని జ‌న‌సేన నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ స‌మావేశాల‌కు ప‌వ‌న్ నేరుగా హాజ‌రు కాక‌పోయినా వీడియో సందేశం పంపేలా ప్లాన్ చేస్తున్నారు. ప‌వ‌న్ సోద‌రుడు నాగ‌బాబు ఈ సమావేశాల‌కు హాజ‌రై కాపుల మ‌ద్ద‌తు పొందేందుకు ప్ర‌య‌త్నించ‌నున్న‌ట్లు తెలిసింది.

కాపు రిజ‌ర్వేష‌న్ల స‌మస్య చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌పుడు ఈ స‌మ‌స్య‌పై ప్ర‌శ్నించిన జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చాక దాని సంగ‌తే మ‌ర్చిపోయారంటూ ప‌వ‌న్ విమ‌ర్శిస్తున్నారు. ఇప్పుడ‌దే స‌మ‌స్య‌ను ప్ర‌ధానంగా తీసుకుని తాము అధికారంలోకి వ‌స్తే క‌చ్చితంగా ఓ ప‌రిష్కారం చూపుతామ‌ని ఇప్పుడు జ‌న‌సేన కాపుల‌కు హామీ ఇచ్చే అవ‌కాశాలున్నాయి. కాపుల‌ను త‌మ వైపు తిప్పుకుంటూనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ పార్టీకి మెరుగైన ఫ‌లితాలు ద‌క్కుతాయ‌ని జ‌న‌సేన ఇప్ప‌డు గ్ర‌హించింది. ఒక‌వేళ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నా తాము క‌చ్చితంగా కాపుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుతామ‌ని జ‌న‌సేన గ‌ట్టి హామీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది.

ద‌స‌రా త‌ర్వాత జిల్లాల వారీగా కాపుల‌తో జ‌న‌సేన స‌మావేశాలు ఉంటాయ‌ని స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల కోసం జ‌న‌సేన టీడీపీ పొత్తు పెట్టుకుంటాయ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఒకవేళ అలా జ‌రిగినా కాపుల‌ను ఒక్క‌టి చేసి టీడీపీ నుంచి భారీ సంఖ్య‌లో సీట్లు రాబ‌ట్టాల‌నే ఉద్దేశంతో జ‌న‌సేన ఉన్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో వీలైన‌న్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాల‌ని ప‌వ‌న్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. క‌నీసం 50 స్థానాల్లో గెలిచినా జ‌న‌సేన క్రియాశీల‌కంగా మారుతుందున్న విశ్వాసం ఆ పార్టీలో ఉంది. అందుకే ఇప్పుడా పార్టీ కాపు సామాజిక వ‌ర్గంపై ఫోక‌స్ పెట్టింద‌ని రాజ‌కీయ నిపుణులు చెబుతున్నారు.