కాంగ్రెస్ ఇప్ప‌టికి క‌ళ్లు తెరిచిందా?

అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో పార్టీలో వేగంగా మారుతున్న ప‌రిణామాలు.. పెరుగుతున్న అస‌మ్మ‌తి గ‌ళం.. సీనియ‌ర్ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త‌.. పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు.. పార్టీ భ‌విష్య‌త్‌పై కార్య‌క‌ర్తల్లో ఆందోళ‌న‌.. ఇలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ది పార్టీని ఓ గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ ఎట్ట‌కేల‌కు సిద్ధ‌మైంది. ఆల‌స్యంగా క‌ళ్లు తెరిచిన ఆ పార్టీ అధిష్థానం అక్టోబ‌ర్ 16న కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశం నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించింది. పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌ను రాహుల్ గాంధీకి తిరిగి అప్ప‌గించ‌డం పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు ముగింపు ప‌ల‌క‌డం వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో జ‌రిగే శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్ట‌డం లాంటి విష‌యాల‌పై ఈ స‌మావేశంలో ప్ర‌ధానంగా చ‌ర్చిస్తార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

గ‌తంలో దేశ‌ రాజకీయాల్లో చ‌క్రం తిప్పిన కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్ల నుంచి ప‌త‌నం దిశ‌గా సాగుతోంది. మోడీ ప్ర‌భ‌తో వ‌రుస‌గా రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ ఓట‌మి పాలైన ఆ పార్టీ.. అధికారంలో ఉన్న రాష్ట్రాల‌ను కూడా కాపాడుకోలేక‌పోతోంది. అన్నీ పోనూ ఇప్పుడు కేవ‌లం పంజాబ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్‌లో మాత్ర‌మే ఆ పార్టీ ఒంట‌రిగా అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లోనూ పార్టీలో క‌ల‌త‌లు తీవ్ర స్థాయికి చేరాయి. అందుకు పంజాబ్ ప‌రిణామాలే నిద‌ర్శ‌నం. కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం.. చ‌ర‌ణ్‌జిత్ సింగ్ ముఖ్య‌మంత్రి కావ‌డం.. న‌వ్‌జోత్ సింగ్ సిద్ధూ పీసీసీ అధ్య‌క్ష ప‌దవిని వ‌దులుకోవ‌డం.. ఇలా అక్క‌డ పార్టీలో సంక్షోభం ఏర్ప‌డింది. ఇప్పుడు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌తో పాటు రాజ‌స్థాన్‌లోనూ అలాంటి ప‌రిస్థితులే ఉన్నాయి. అక్క‌డ అధికారంలో ఉన్న సీఎంల‌పై సొంత పార్టీ నేత‌ల్లోనే అసంతృప్తి ఉంది. వాళ్ల‌ను ప‌ద‌వుల నుంచి త‌ప్పించాల‌నే డిమాండ్లు పెరుగుతున్నాయి.

మ‌రోవైపు పంజాబ్లో పార్టీ సంక్షోభాన్ని స‌మర్థంగా ప‌రిష్క‌రించ‌డంలో అధిష్ఠానం విఫ‌ల‌మైంద‌ని.. రాహుల్, ప్రియాంక గాంధీ వ్యూహాలు బెడిసికొడుతున్నాయ‌ని కాంగ్రెస్‌లోని జీ23 సీనియ‌ర్ నేత‌ల బృందం బ‌హిరంగంగానే విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పార్టీలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు తార‌స్థాయికి చేర‌డంతో కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశాన్ని ఏర్పాటు చేయాల‌ని జీ23 నేత‌లు డిమాండ్ చేశారు. దీంతో ఎట్ట‌కేల‌కు సీడ‌బ్ల్యూసీ స‌మావేశం నిర్వ‌హించేందుకు అధిస్ఠానం ఒప్పుకుంది. ఈ నెల 16న జ‌రిగే ఈ స‌మావేశం వాడివేడిగా సాగే అవ‌కాశం ఉంది. పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌ల‌తో పాటు దేశంలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితులు వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల ఎన్నిక‌లు ప్ర‌ధాన అజెండాగా ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

కొద్దిరోజులుగా పార్టీ నాయ‌క‌త్వ లేమితో స‌త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఈ స‌మావేశం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలిగా ప్ర‌స్తుతం సోనియా గాంధీ కొన‌సాగుతున్నారు. ఆమె రెండేళ్లు మాత్ర‌మే ఈ ప‌ద‌విలో ఉంటాన‌ని గ‌తంలోనే స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో కొత్త అధ్య‌క్షుణ్ని ఎన్నుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. రాహుల్ గాంధీకి తిరిగి పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించాల‌నే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఆ దిశ‌గా సోనియా గాంధీ కూడా సీనియ‌ర్ల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి ఈ స‌మావేశంలో పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా రాహుల్‌ను నియ‌మించాల‌నే విష‌యంపై ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుందేమో చూడాలి.