బద్వేలు ఉప ఎన్నిక.. జనసేన ఇంకో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే గుంతోటి వెంకటసుబ్బయ్య ఈ మార్చిలో చనిపోవడంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఎన్నిక జరగబోతోంది. వెంకటసుబ్బయ్య స్థానంలో ఆయన భార్య డాక్టర్ సుధనే అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోయినపుడు వారి కుటుంబ సభ్యులను బరిలోకి నిలిపితే.. ఏకగ్రీవం కోసం సహకారం అందించే సంప్రదాయాన్ని చాలా పార్టీలు పాటిస్తున్నాయి. తెలుగుదేశం ఈ సంప్రదాయాన్ని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంది.

జనసేన సైతం అదే బాటలో పయనిస్తూ తాము అభ్యర్థిని నిలబెట్టబోమని ప్రకటించింది. ఐతే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అందుకు అంగీకరించలేదు. బీజేపీ సరసన పుంతల సురేష్‌ను అభ్యర్థిగా ప్రకటించగా.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కమలమ్మను అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే.

ఐతే జనసేనకు బీజేపీతో పొత్తు ఉన్న నేపథ్యంలో ఎన్నికల విషయంలో ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. సంప్రదాయాన్ని గౌరవించి జనసేన ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్న నేపథ్యంలో పూర్తిగా ఈ ఎన్నికలకు దూరంగా ఉండాల్సిందే. వేరే అభ్యర్థులకు కూడా జనసైనికులు మద్దతు ఇవ్వకూడదు. బీజేపీతో పొత్తు ధర్మం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అందులోనూ కొంత కాలంగా జనసేనకు, బీజేపీకి మధ్య అంతరం పెరుగుతున్న నేపథ్యంలో ‘సంప్రదాయం’ పేరు చెప్పి పొత్తు ధర్మాన్ని పక్కన పెట్టొచ్చు. ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండొచ్చు. కానీ జనసేన అలా చేయట్లేదు. అభ్యర్థిని నిలపకుండా టీడీపీ బాటలో పయనించడంతో వైకాపాకు మద్దతుగా నిలిచే మీడియా వర్గాలు.. జనసేనకు పొత్తు ఉన్నది బీజేపీతోనా, టీడీపీతోనా అని ప్రశ్నించాయి. ఈ నేపథ్యంలో జనసేన అప్రమత్తమైంది.

బద్వేలు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి జనసేన పూర్తి మద్దతు ఉంటుందని, జనసైనికులు సురేష్‌కు పూర్తి మద్దతు ఇవ్వాలని పార్టీ అగ్ర నేత నాదెండ్ల మనోహర్ శనివారం స్టేట్మెంట్ ఇవ్వడం గమనార్హం. ఐతే ఓవైపు సంప్రదాయాన్ని అనుసరించి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని, ఇప్పుడేమో పొత్తు ధర్మం పేరు చెప్పి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో జనసైనికులకే అంతుబట్టడం లేదు.