రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.. చెప్పడం కష్టం. వరుస పరాజయాలు.. పార్టీ అధినేతకు పెద్ద పరీక్షగా మారిన దరిమిలా.. దేశవ్యాప్తంగా.. యాత్రా రాజకీయాలు పుంజుకుంటు న్నాయి. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పలు పార్టీల ప్రధాన నాయకులు.. యాత్రా స్పెషల్స్‌కు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు ఏడాది, రెండేళ్ల ముందు.. పాదయాత్రలు చేయడం.. లేదా బస్సు యాత్రలు చేయడం ద్వారా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే తరహా ప్రకటన చేశారు.
గతంలో చంద్రబాబు చేపట్టిన వస్తున్నా.. మీకోసం.. యాత్రకు 9 ఏళ్లు నిండిన నేపథ్యాన్ని పురస్కరించుకుని.. సంబరాలు చేసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆ వేదికగానే.. సంచలన ప్రకటన చేశారు. త్వరలో నే తాను మరో ప్రజా యాత్రకురెడీ అవుతున్నారని చెప్పారు. అయితే.. అది పాదయాత్రా? లేక.. బస్సు యాత్రా.. అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. బాబు నిర్ణయంపై విమర్శకుల నుంచి ఒకింత విశ్లేషణలు ఘాటుగానే వచ్చాయి. ఇదిలావుంటే.. వస్తున్నా మీకోసం యాత్రతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఇక, గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత జగన్ కూడా అధికారం అందిపుచ్చుకున్నారు. సో.. యాత్రలకు.. అధికారాలకు మధ్య సంబంధం స్పష్టంగా కనిపిస్తుండడం విశేషం.
సరే.. ఈ విషయాన్ని పక్కన పెడితే.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న యూపీలో (ఉత్తరప్రదేశ్)నూ.. అక్కడి ప్రధాన ప్రతిపక్షం.. సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కూడా యాత్రకు తెరదీశారు. ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేస్తున్నాయి. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఈనెల 12 నుంచి ‘సమాజ్‌వాదీ విజయ్ యాత్ర’ ప్రారంభించనున్నారు. 2001లో ‘క్రాంతి రథ యాత్ర’ అనంతరం 2002లో, 2011 యాత్రల అనంతరం ఎస్పీ అధికారం చేపట్టడం విశేషం. ఈ నేపథ్యంలోనే మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రస్తుత ‘యాత్ర’ దోహదపడుతుందని పార్టీవర్గాలు భావిస్తున్నాయి.
తన రాజకీయ జీవితంలో మూడోసారి పార్టీ యాత్రను ప్రారంభించనున్నారు అఖిలేశ్. ఆయన యాత్ర చేసిన ప్రతిసారి అధికారంలోకి వచ్చిందని.. ఈసారీ అదృష్టం కలిసొస్తుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ‘2011 యాత్ర తర్వాత ఎస్పీ అధికారంలోకి వచ్చింది. అఖిలేశ్ మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి కూడా మేము తిరిగి అధికారం చేపడతాం’ అని పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి అన్నారు. అంటే.. యాత్రలతో అధికారంలోకిరావడం..అనేది ఏపీలోనే కాదు.. యూపీలోనూ సెంటిమెంటుగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.