జగన్‌ ఆయనొక్కడి మాటే వింటాడంటున్న జేసీ

ఆంధ్రప్రదేశ్ మీడియా వాళ్లు, జనాలు చాలా ఆసక్తిగా ఏం మాట్లాడతారా అని చూసే నాయకుల్లో జేసీ దివాకర్ రెడ్డి ముందుంటారు. స్వపక్షం, విపక్షం అని లేకుండా పెద్ద నాయకులపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తెలుగుదేశంలో ఉంటూ చంద్రబాబును వేదిక మీద పెట్టుకుని ఆయన్ని విమర్శించడం జేసీకే చెల్లింది.

ఇప్పుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌పై, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆయన తరచుగా వాగ్బాణాలు విసురుతున్నారు. తాజాగా జగన్‌ను మరోసారి ఆయన టార్గెట్ చేశారు. ఏపీలో జగన్ నియంత పాలన సాగిస్తున్నాడంటూ విమర్శించారు. ఒకప్పుడు రాజకీయాలు వేరుగా ఉండేవని.. బస్సుల్ని జాతీయం చేసినపుడు అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కోర్టు తనను తప్పుబట్టిందని రాజీనామా చేశారని.. కానీ ఇప్పుడు జగన్ కోర్టులు వరుసగా తన నిర్ణయాల్ని తప్పుబడుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదని జేసీ అన్నారు.

నేనే రాజు.. నేనే మంత్రి.. నేను తప్ప ఎవ్వడూ లేడు అన్నట్లుగా జగన్ పాలన సాగుతోందని జేసీ విమర్శించారు. అమరావతిలో రాజధానిని కొనసాగించాలంటూ రైతులు అన్ని రోజులుగా దీక్ష చేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని.. దున్నపోతు మీద వాన కురిసినట్లు ఉందని.. ఆయన ప్రజల అభిప్రాయాల్ని పట్టించుకోవడం లేదని.. జగన్ పాలన గురించి చదువుకున్న వాళ్లకు బాగా అర్థమైందని.. కానీ కాయకష్టం చేసుకుంటున్న వాళ్లకు మాత్రం ఇంకా అర్థం కాలేదని జేసీ అన్నారు.

జగన్ ఎవరి మాటా వినడని.. ఆయన వింటే గింటే ప్రధాని నరేంద్ర మోడీ మాట మాత్రమే వింటారని.. ఆయన తననేమైనా చేస్తాడనే భయంతోనే అలా చేస్తాడని.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న అహం కరెక్ట్ కాదని.. నాకు రాజ్యాంగం లేదు. నేను చెప్పిందే జరగాలి అనే ధోరణి కనిపిస్తోందని.. రాష్ట్రంలో నియంత పాలన మారాలని జేసీ అభిప్రాయపడ్డారు.

OTT Streaming Dates on Amazon Prime, Netflix & Others