ఏపీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మళ్లీ పైరయ్యారు. తాజాగా ఆయన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. దీంతో మరోసారి.. వైసీపీలో ఆనం వ్యవహారం చర్చకు వచ్చింది. వాస్తవానికి .. జగన్ కేబినెట్లో చోటు దక్కుతుందని.. భావించిన ఆనం రామనారాయణరెడ్డికి ఇప్పటి వరకు కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన.. కేవలం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంటే.. సొంత పార్టీ వైసీపీలోనూ నేతలు పెద్దగా ఆయనకు సహకించడం లేదు.
కాంగ్రెస్ తర్వాత.. టీడీపీలో చేరి.. గత ఎన్నికలకుముందు. వైసీపీ బాట పట్టిన ఆనంకు వైసీపీలోనే మంత్రులతోను, ఇతర ప్రజా ప్రతినిధులతోనూ సంబంధాలు అంతంత మాత్రంగానేఉన్నాయి. పైగా జగన్ దగ్గర కూడా స్వేచ్ఛలేదనే భావన ఉంది. దీనికితోడు.. మంత్రి పదవిని ఆశించినా.. ఆయనకు దక్కకపోవడం మరో మైనస్. ఈ నేపథ్యంలోనే తరచుగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఏడాది కిందట.. ప్రారంభించిన ఈ నిరసన పర్వం.. ఇప్పటికీ కొనసాగుతుండడం గమనార్హం. అధికారులు తనను లెక్కచేయడం లేదని.. అసలు ఎమ్మెల్యేగా కూడా ఎవరూ గుర్తించడం లేదని.. గతంలో ఆరోపణలు చేసిన.. ఆయన ఇప్పటి వరకు నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడం తనకు సిగ్గుగా ఉందని.. బహిరంగంగానే వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే.. మధ్య మధ్య కూడా విమర్శలు చేస్తున్నా.. అవి పెద్దగా హైలెట్ కాలేదు. కానీ, ఇప్పుడు మరోసారి మంత్రి బాలినేని సమక్షంలోనే రామనారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు. “మీరు మాపైనా.. అధికారులపైనా ఒత్తిడి చేయొద్దు. ముందు.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించండి. ఏ పనిచేయాలన్నా.. కాంట్రాక్టర్లు రావడం లేదు. గతంలో చేపట్టిన పనులకే 12 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంది. ఇవి ఇవ్వకుండా.. మళ్లీ కొత్త పనులు అంటే.. ఎలా..? అసలు అభివృద్ధి ఎలా చేయాలో కూడా తెలియకపోతే.. ఎలా? అధికారులపై పెత్తనం చేసినంత మాత్రాన పనులు జరగవు” అని ఆనం విమర్శించారు.
నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి నియోవజకవర్గం సమీక్ష సమావేశంలో మంత్రి బాలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త భవనాలను నిర్మించే అంశంపై ఆయన మాట్లాడారు. అధికారులు.. కొత్త భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సమయంలోనే ఆర్ అండ్ బీ శాఖకు చెందిన సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో మంత్రి బాలినేని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతోపాటు.. ఆయనను సస్పెండ్ చేయాలంటూ..ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనం.. ప్రభుత్వంపైనా విరుచుకుపడడం చర్చకు దారితీసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates