పోకచెక్కతో నువ్వు- తలుపు చెక్కతో నేను.. అన్నట్టుగా ఉంది.. జనసేనాని పవన్ కళ్యాణ్ వర్సెస్ పేర్ని నాని వివాదం. ఒకరిపై ఒకరు.. దూషణల పర్వం పెరిగిపోయింది. పవన్ మొత్తానికి కామెంట్లు చేస్తుంటే.. పేర్ని పవన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. రిపబ్లిక్ ఫిలిం.. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ప్రారంభమైన ఈ రగడ.. ఇప్పుడు మరింత తీవ్రంగా మారింది. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. దీంతో పాటు ‘హూ లెట్ ద డాగ్స్ ఔట్’ అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటిగా పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ ట్వీట్లకు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అని ట్వీట్ చేశారు. అనంతరం పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ పోస్ట్ చేశారు. ఇక, ఈ రోజు పవన్ కల్యాణ్ మరోసారి.. వైసీపీ ప్రభుత్వంపై ఘాటు ట్వీట్ చేశారు. “వైసీపీ ప్రభుత్వం ‘పాలసీ ఉగ్రవాదం’ కి అన్నీ రంగాలు, అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలిసిన సమయం ఆసన్నమయింది..”- అని పవన్కల్యాణ్ ట్వీట్ చేశారు.
అయితే.. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే.. ప్రజలకు మేలు చేయాల్సిన.. ప్రభుత్వ పెద్దలు, లేదా మంత్రులు, ఇటు సమస్యలపై సరైన పంథాలో ముందుకు సాగాల్సిన పవన్ కళ్యాణ్ కూడా ఇలా రోడ్డున పడి వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం.. మంత్రులను కుక్కలతోపోల్చడం.. సన్నాసులు అనడం.. నా.. కొ..క.. అని మంత్రులు పేర్కొనడం వంటివి.. ఏమేరకు ప్రజలకు మేలు చేస్తాయి. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. ఈ సంచలన డైలాగులతో .. పవన్ పుంజుకునేది ఏమాత్రం లేదు. ఏదైనా ఉంటే.. గత ఎన్నికల్లోనే పుంజుకునేవారు. మరి ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని.. జనసేన అధినేత పవన్.. ఇలా రోడ్డున పడడం వల్ల పరువు పోవడం .. తప్ప.. ప్రయోజనం ఏంటనేది.. మేధావుల మాట. ఎక్కడో ఒక చోట దీనికి ఎవరో ఒకరు ఫుల్ స్టాప్ పెట్టాలి కదా? అంటున్నారు. మరి ఎవరు ఆగుతారో.. చూడాలి!
Gulte Telugu Telugu Political and Movie News Updates