సలహాదారుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నియామకాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. తనకు సలహాదారులుగా తీసుకుంటున్న వాళ్ళ సలహాలను జగన్ ఎప్పుడైనా తీసుకుంటున్నారా ? సలహాలిచ్చేంత అవకాశం సలహాదారులకు జగన్ ఇస్తున్నారా ? అనేది ఎవరికీ అర్థం కాని విషయం. సలహాదారులుగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళకి జగన్ కు సలహాలిచ్చింత సీన్ ఉందా అనేది కూడా అనుమానమే.
ఎందుకంటే అనేక శాఖల్లో సలహాదారులుగా ఉన్న వారితో జగన్ భేటీ అయినట్లు, చర్చించినట్లు, వాళ్ళిచ్చిన సలహాలు విన్నట్లు, తీసుకున్నట్లు ఎక్కడా వినలేదు, చూడలేదు. జగన్ అధికారంలోకి రాగానే చాలామందిని సలహాదారులుగా నియమించుకున్నారు. ఇందులో ఒకరిద్దరు రాజీనామాలు కూడా చేసేశారు. మరి మిగిలిన వారిలో అత్యధికులు ఏమి చేస్తున్నారో కూడా తెలీదు. వాళ్ళ సంగతి ఇలాగుండగానే తాజాగా మరో సలహాదారుని తీసుకోబోతున్నారు.
ఉద్యోగుల సర్వీసు నిబంధనలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర రెడ్డిని సలహాదారుగా తీసుకునేందుకు రంగం సిద్ధమవుతోందని సమాచారం. సలహాదారుగా నియమితులైన తర్వాత ఈయనిచ్చే సలహాలేమిటో ? ప్రభుత్వం తీసుకునేదేమిటో ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఉద్యోగుల సర్వీసు నిబంధనలపై సలహాలు, సూచనలు చేయటానికే ఐఏఎస్ అధికారులున్నది. ఐఏఎస్ అధికారులకు తోడు అవసరమైనపుడు ఉద్యోగ సంఘాల నేతలు ఎలాగూ ఉంటారు.
మరీ అవసరమైనపుడు న్యాయపరమైన సలహాలు, సూచనలు చేయడానికి లా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు ఎలాగు ఉన్నారు. కోర్టుల్లో ఇలాంటి వ్యవహారాలు చూడటానికే అడ్వకేట్ జనరల్ ఉన్నది. మరి ఉద్యోగుల సర్వీసు విషయాలపై సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఇంతమంది ఉండగా కొత్తగా కాబోయే సలహాదారు ఏమి చేస్తారు ? నిజానికి సలహాదారులుగా నియమితులైన వారిలో అత్యధికులకు ప్రభుత్వం నుండి అందుతున్న జీతాలు, భత్యాలు దండగనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయి.