జనసేనాని పవన్ కళ్యాణ్.. మళ్లీ తన పాతరూట్‌లోకి వచ్చేశారా? కూర్చున్నా.. నిల్చున్నా.. ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారా? ఇక, వైసీపీ సర్కారుకు చుక్కలు చూపించాలని నిర్ణయించుకున్నారా? వచ్చే ఎన్నికల వరకు ఇదే పంథాను కొనసాగించనున్నారా? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. అక్టోబరు 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర సర్కారుపై నిరసన తెలిపేందుకు పవన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. తనే దిగితే.. ఇక, తన వెంటన జనసైనికులు కూడా భారీ సంఖ్యలో క్యూకట్టడం ఖాయమని అంటున్నారు. మొత్తంగా తాజా పరిణామంపై జనసేనలో ఆసక్తికర చర్చ సాగుతుండడం గమనార్హం.
విషయంలోకి వెళ్తే.. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో జనసేన కొన్ని చోట్ల సత్తా చాటింది. కొన్ని చోట్ల ఊహించని విధంగా దూసు కుపోయింది. దీంతో.. జనసేనలోనూ అంతర్మథనం ఏర్పడింది. పవన్ కనుక కొద్దిగా పుంజుకుంటే.. ఇక తిరుగులేదని.. ఆ పార్టీలో సీనియర్లు.. భావిస్తున్నారు. ఇక, ఇదే విషయంపై ప్రధాన మీడియాలోనూ కథనాలు వచ్చాయి. గత ఎన్నికల్ తర్వాత.. పవన్ పెద్దగా ప్రజల్లోకి వచ్చింది లేదు. కేవలం తిరుపతి ఉప ఎన్నిక తర్వాత.. ఆయన ఎక్కడా కనిపించలేదు. ఈ క్రమంలో వచ్చిన పరిషత్ ఎన్నికల ఫలితంతో మున్ముందు పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని జనసేన అంచనా వేసింది.
ఈ క్రమంలో పవన్.. ఏమనుకున్నారో.. ఏమో.. ఆ వెంటనే.. అంటే.. మండల పరిషత్ ఫలితాలు వెల్లడైన రెండో రోజు నుంచే పవన్ తన దూకుడు ప్రారంభించారు. ఏపీ సర్కారుపై నిశిత విమర్శలు చేయడం ప్రారంభించారు. ఏ వేదిక దొరికితే .. ఆ వేదికపై గళం వినిపించారు. స్వయంగా పార్టీ ఆఫీస్‌లో మీటింగ్ పెట్టి.. తమ ఫలితాలను విశ్లేషిస్తూ.. వైసీపీని విమర్శించారు. ఇక, తర్వాత ట్వీట్‌లోనూ.. భారీ ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక, రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్‌లోనూ కుమ్మేశారు. ఇక, ఇప్పుడు మరో రూపంలో క్షేత్రస్థాయిలో పవన్ దూకుడు చూపించేందుకు రెడీ అయ్యారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకొని తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో కల్యాణ్ శ్రమదానం రూపంలో నిరసన వ్యక్తం చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రహదారుల మరమ్మతు కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ రోడ్డు మరమ్మతు పనులతో పాటు అనంతపురం జిల్లా కొత్తచెరువు రోడ్డు పనుల్లో ఆయన పాల్గొననున్నట్లు ట్వీటర్ ద్వారా వెల్లడించారు. వాస్తవానికి ఏపీలో రహదారులు బాగోలేవని.. ప్రభుత్వం వాటివైపు కన్నెత్తి కూడా చూడడం లేదని.. దీంతో ప్రమాదాలు చోటు చేసుకుని నిండు జీవితాలు నాశనం అవుతున్నాయని.. పవన్ తరచుగా ఆరోపిస్తున్నారు. ఇటీవల ట్విట్టర్‌లోనూ రోడ్ల ఉద్యమం చేపట్టారు. ఈక్రమంలో తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయం.. ఎలాంటి వేడి పుట్టిస్తుందో చూడాలి.