ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తొలిసారి నిరసన గళం వినిపించారు. వాస్తవానికి ఏపీలో జగన్ సర్కారు ఏర్పడేందుకు తాము అనేక యజ్ఞాలు, యాగాలుచేశామని చెప్పిన స్వరూపానందేంద్ర.. ఇప్పటివరకు అనేక ఘటనలు జరిగాన.. అన్ని వర్గాల నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా.. ఎప్పుడూ రియాక్ట్ కాలేదు. అంతేకాదు.. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరిగి..పక్కనే ఉన్న విజయనగరంలోని రామతీర్థంలో రాముడి విగ్రహం శిరస్సును దుండగులు ఛేదించినా.. కూడా ఈ స్వామి స్పందించలేదు. మౌనంగానే పరిశీలించారు. కానీ.. ఇప్పుడు మాత్రం ఏపీ సీఎంపై ఆయన ఫైరయ్యారు.
దీనికి కారణం.. ప్రస్తుతం.. ఏకీకృతంగా ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ సంక్షేమ శాఖలో కలిపేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే! బ్రాహ్మణ కార్పొరేషన్‌ను వెనుకబడిన సంక్షేమ శాఖలో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని స్వరూపానందేంద్ర సరస్వతి భావిస్తున్నట్లు శారదాపీఠం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు శారదాపీఠం తెలిపింది. అగ్ర వర్ణాలన్నింటినీ ఈబీసీ జాబితాలోకి చేర్చాలని శారదాపీఠం ప్రతిపాదిస్తోంది. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నామని, బ్రాహ్మణులను బీసీ జాబితాలోకి కలపాలని చూస్తే పోరాటం చేస్తామని విశాఖ శారదాపీఠం హెచ్చరించింది.
అయితే.. పలు విషయాల్లో జగన్ ముందుగానే స్వామితో సంప్రదింపులు జరుపుతున్నారని.. కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఆఖరుకు మంత్రి వర్గ ఏర్పాటులోనూ.. స్వామి సూచనలను పాటించారని.. అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అయితే.. ఈమధ్య కాలంలో తీసుకుంటున్న నిర్ణయాల్లో స్వామికి సమాచారం లేదని.. అందుకే ఇప్పుడు హఠాత్తుగా తనను తాను గుర్తు చేసుకునే పనిలో భాగంగానే ఇలా హెచ్చరికలు జారీచేసి ఉంటారని అంటున్నారు. కొన్నాళ్ల కిందట కూడా స్వయంగా ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రయాణం పెట్టుకుని స్వామిని కలిసి వచ్చారు. అప్పటి వరకు బాగానే ఉన్న వీరి సంబందాలు ఇటీవల కాలంలో బెడిసి కొట్టాయా?
ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు, ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన జీవో వంటి విషయాల్లోనూ స్వామి సూచనలను జగన్ పాటించలేదా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా స్వామి చేసిన హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.