ప‌వ‌న్ ప్ర‌తి మాట‌కీ స‌మాధాన‌మిస్తా : మోహ‌న్ బాబు

శ‌నివారం రిప‌బ్లిక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీరు వ‌ల్ల‌ తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఇబ్బంది ప‌డుతుండ‌టం గురించి చెబుతూ.. సీనియ‌ర్ న‌టుడు మోహ‌న్ బాబు ప్ర‌స్తావన తేవ‌డం తెలిసిందే.

వైసీపీ ప్ర‌భుత్వం టికెట్ల రేట్ల‌పై నియంత్ర‌ణ తేవ‌డం, థియేట‌ర్ల‌ను ఇబ్బందుల్లోకి నెట్ట‌డం గురించి ప్ర‌స్తావిస్తూ.. దీనిపై మోహ‌న్ బాబు మాట్లాడాల‌ని, సినీ పరిశ్రమను హింసించొద్దని ప్ర‌భుత్వానికి చెప్పాల‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు. ‘‘వైస్ కుటుంబం త‌మ‌కు బంధువుల‌ని మోహ‌న్ బాబు గారు చెప్ప‌డం విన్నా.

మ‌రి ఆయ‌నైనా ‘కావాలంటే పవన్‌కల్యాణ్‌ను బ్యాన్‌ చేసుకోండి అతను, మీరూ తేల్చుకోండి’ అని అర్థమయ్యేలా ఆ ప్రభుత్వానికి చెప్పాలి. ఈ రోజు చిత్ర పరిశ్రమకు పెట్టిన నియమ, నిబంధనలు రేపు మీ విద్యానికేతన్‌కు కూడా పెట్టొచ్చు. ఫీజులు ఆన్ లైన్లో క‌ట్ట‌మ‌ని అనొచ్చు. కాబ‌ట్టి మోహ‌న్ బాబు గారు దీనిపై మాట్లాడాలి’’ అని పవన్ పేర్కొన్నాడు.

ఈ వ్యాఖ్య‌ల‌పై మోహ‌న్ బాబు త్వ‌ర‌గానే స్పందించారు. ప‌వ‌న్ అన్న ప్ర‌తి మాట‌కూ సమాధానం చెబుతాన‌ని మోహ‌న్ బాబు పేర్కొన‌డం విశేషం. ట్విట్ట‌ర్ వేదికగా ఈ విష‌య‌మై ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “నా చిరకాల మిత్రుని తమ్ముడైన పవన్‌కల్యాణ్‌ నువ్వు నాకంటే చిన్నవాడివి. అందుకని ఏకవచనంతో సంభోదించాను. అది తప్పేమీకాదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌. సంతోషమే. ఇప్పుడు ‘మా’ ఎన్నికలు జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడన్న సంగతి మీకు తెలిసిందే. అక్టోబరు 10వ తేదీన ఎలక్షన్స్‌ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతిమాటకీ నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతా. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటును నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నా. థ్యాంక్యూ వెరీ మచ్‌” అని త‌న ట్వీట్లో మోహ‌న్ బాబు పేర్కొన్నారు.