ఏపీ ప్రభుత్వం.. సినిమా టికెట్లపై వచ్చే ఆదాయాన్ని చూపించి.. కొత్తగా అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తోందని.. అప్పుల కోసమే సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని అనుకుంటోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు భారీ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్‌ను సంపూర్ణేష్ బాబుతో పోల్చారు. పవన్‌పై కామెంట్ల వర్షం కురిపించారు. టికెట్ల విక్రయాన్ని సమర్దించుకున్నారు. ఇదంతా సినిమా రంగ పెద్దల కోరిక మేరకే ప్రభుత్వం చేస్తోందన్నారు. మొత్తానికి పవన్‌కు మంత్రి కౌంటర్ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
“పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటే. ఆన్‌లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. ఆన్‌లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం? దాని వల్ల జరిగే నష్టం ఏమిటి? అకౌంటబిలిటీ రావాలన్నదే సీఎం ఆలోచన. పారదర్శకత కోసమే ఆన్‌లైన్ పోర్టల్. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే మా ఉద్దేశం. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతవరకు సబబు. నా ఒక్కడి కోసం చిత్రసీమని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదు. ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్. చిత్రపరిశ్రమని ఇబ్బంది పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు.”అని అనిల్ చెప్పారు.
అంతేకాదు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. చిత్ర పరిశ్రమనంతా ఇబ్బంది పెడుతున్నామని ప్రొజక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్‌ని తిట్టడం పవన్ కల్యాణ్‌కు ఫ్యాషన్ అయిపోయిందని దుయ్యబట్టారు. ‘ప్రభుత్వ తీరును మారుస్తాను, నేను రోడ్డుపైకొస్తే మనిషిని కాదు, బెండు తీస్తాం’ అని పవన్ కల్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశాం. రెండు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకే మా అడుగులు అంటున్నాడు. పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పైకెళ్ళే లోపే పార్టీ చాపచుట్టేయడం ఖాయం. అని మంత్రి అనిల్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై పవన్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates