భార‌త్ బంద్‌కు జ‌గ‌న్ ఓకే.. కేంద్రంపై స‌మ‌ర‌మేనా?

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాలు, రైతు వ్య‌తిరేక విధానాల‌కు నిర‌స‌న‌గా.. రైతు సంఘాలు.. కార్మిక సంఘాలు.. ఇత‌ర ప్ర‌జా సంఘాలు.. ఈ నెల 27న దేశ‌వ్యాప్తంగా భార‌త్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌ను బీజేపీ పాలిత రాష్ట్రాలు.. పాటించ‌క‌పోగా.. బంద్ పాటించే వారిపై కేసులు న‌మోదు చేయ‌నున్న‌ట్టు.. యూపీ స‌ర్కారు ప్ర‌క‌టించింది.

ఇక‌, బీజేపీని స‌మ‌ర్ధించే ప్రాంతీయ పార్టీలు, మోడీ కూట‌మిలోని పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు కూడా ఈ బంద్‌కు దూరంగా ఉన్నాయి. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌చ్చేస‌రికి .. తెలంగాణ‌ ప్ర‌భుత్వం దీనిపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. ఇది కేంద్రంతో ఉన్న సంబంధాల‌తో ముడిప‌డిన సునిశిత వ్య‌వ‌హారంకావ‌డంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.

అయితే.. ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. రైతుచట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 27న రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిస్తుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం 27 అర్ధరాత్రి నుంచి 28 మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. రైతు చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా భారత్‌ బంద్‌కు మద్దతునిస్తున్నామని తెలిపారు. ఇక‌, ఈ బంద్‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌ద్ద‌తు తెలిపింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

స‌రే.. ప్ర‌తిప‌క్షం మాట అలా ఉంచితే.. కేంద్రంపై ఉన్న‌ట్టుండి.. జ‌గ‌న్ స‌మ‌ర శంఖం పూరించ‌డం.. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది. నిజానికి కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఆయ‌న ఎంపీలు.. పార్ల‌మెంటులో మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు కూడా వైసీపీ రాజ్య‌స‌భ‌లో మ‌ద్ద‌తు తెలిపింది. కానీ, ఇప్పుడు అనూహ్యంగా భార‌త్ బంద్‌కు ప్ర‌భుత్వం స‌హ‌క‌రించ‌డం.. బ‌స్సులు నిలిపివేత‌, వాణిజ్య ప్రాంతాల మూసివేత ప్ర‌క‌ట‌న‌లు ఆస‌క్తిగా మారాయి. అదేస‌మ‌యంలో తాజాగా ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను కూడా జ‌గ‌న్ ర‌ద్దు చేసుకున్నారు. అంటే.. ఈ ప‌రిణామాల వెనుక కేంద్రం త‌మ ప‌ట్ల వివ‌క్ష చూపుతోంద‌నే భావ‌న జ‌గ‌న్‌లో ఉందా?

అంతేకాదు.. ఇక‌, కేంద్రంతో నెమ్మ‌దిగా మాట్లాడితే.. ప‌నులు జ‌ర‌గ‌వ‌ని బావిస్తున్నారా? లేక‌.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌ద్ద‌తు ఇస్తున్న‌ప్పుడు.. తాము ఇవ్వ‌క‌పోతే.. ఎలా అని భావిస్తున్నారా? లేక‌.. రైతు ప్ర‌భుత్వంగా చెప్పుకొనే త‌మ స‌ర్కారు.. రైతుల‌కు కేంద్రం ఇంత అన్యాయం చేస్తున్నా.. స్పందించ‌డం లేద‌నే విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టేందుకు ఇలా నిర్ణ‌యం తీసుకున్నారా? అనే ప్ర‌శ్న‌లు.. చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే.. నాలుగు మాసాల కింద‌ట కూడా రైతులు భార‌త్ బంద్‌కు పిలుపు ఇచ్చిన‌ప్పుడు.. ప్ర‌భుత్వం స‌హ‌క‌రించడం. మొత్తానికి జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.