ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఫలితాలు ఆ పార్టీ అధినాయకుడు పవన్ కల్యాణ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయా? ఆయనలో వచ్చిన మార్పుతో పార్టీ తిరిగి పుంజుకోనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తాజా పరిషత్ ఎన్నికల ఫలితాలు ఆయనతో కొత్త రాజకీయ ఆశలను చిగురింపచేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఫలితాలను ఆయన సానుకూలంగా మలుచుకున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించి 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కల్యాణ్ ఆ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఇటు ఏపీలో టీడీపీకి.. అటు కేంద్రంలో బీజేపీకి మద్దతుతోనే ఆగిపోయారు. నేరుగా ఎన్నికల్లో పోటీచేయలేదు. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగిన ఆయనకు ఘోర ఓటమి ఎదురైంది. తాను పోటి చేసిన రెండు స్థానాల్లోనూ ఆయన ఓడిపోయారు. పార్టీకి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే దక్కింది. అయినా ఆయన నిరాశపడకుండా భవిష్యత్‌పై ఆశతో పార్టీ కార్యాకలాపాలను నిర్వహిస్తున్నారు. జగన్ సర్కారు మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన.. మళ్లీ సినిమాలపై దృష్టి పెట్టి వరుస చిత్రీకరణలతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిషత్ ఎన్నికలు ఆయనలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
పరిషత్ ఎన్నికల్లో జనసేన 1200 స్థానల్లో పోటీచేస్తే 177 స్థానాల్లో గెలుపొందిందని పార్టీ వర్గాలు చెప్పాయి. పరిషత్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో తమ పార్టీకి 25.2 శాతం ఓట్లు దక్కాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నట్లు పవన్ తెలిపారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడి ఇంత శాతం ఓట్లు దక్కించుకున్న జనసేన.. ఇక నుంచి అధికార వైసీపీపై పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతుందని ఆయన స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజల పక్షాన నిలబడతామని పవన్ చెప్పడంతో ఎప్పుడూ లేనంత ఆత్మవిశ్వాసం ఆయన మాటల్లో కనబడుతుందనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఫలితాలు పవన్‌లో మార్పు తెచ్చాయని చెబుతున్నారు.
పవన్ ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో పార్టీ నాయకులతో విస్త్రత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యచరణ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే పవన్ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం మొదలెడతారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీతో బంధం తెంచుకునేందుకు పవన్ సిద్ధమయారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక జగన్‌పై పోరాటంలో ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తామని పవన్ చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో జనసేన మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందనే ఉహాగానాలకు బలం చూకూరింది. ప్రస్తుతం పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న పవన్.. ఇదే జోరు కొనసాగించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates