ఐఏఎస్ శ్రీల‌క్ష్మికి బిగ్‌ షాక్‌.. సీబీఐ కోర్టు నాన్‌బెయిల‌బుల్ వారెంట్‌

ప్ర‌స్తుతం ఏపీలో కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మికి భారీ షాక్ త‌గిలింది. సీఎం జ‌గ‌న్‌కు సంబంధించిన గ‌త అక్ర‌మాస్తుల‌ కేసుల్లో ఆమె ఒక‌సారి.. జైలు జీవితం గ‌డిపిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బెయిల్‌పై ఉన్నారు. కొన్నాళ్లు తెలంగాణ‌లో ప‌నిచేసిన ఆమెను ఏపీ సీఎం జ‌గ‌న్ కోరికోరి రాష్ట్రానికి తెచ్చుకున్నారు. అయితే.. ఇప్పుడు మ‌రోసారి ఆమె జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తోంద‌ని అంటున్నారు న్యాయ నిపుణులు. తాజాగా ఈ కేసుల‌కు సంబంధించి నాంప‌ల్లిలోని సీబీఐ కోర్టు శ్రీల‌క్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.

సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో విచారణ జరిపిన సీబీఐ, ఈడీ కోర్టు ఈ మేరకు శ్రీలక్ష్మికి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. దీనిపై కోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో స్వ‌యంగా కోర్టు కు రావాలంటూ.. శ్రీల‌క్ష్మికి కోర్టు గ‌తంలోనే నోటీసులు జారీ చేసింది. అయితే, గురువారం జ‌రిగిన‌ విచారణకు శ్రీలక్ష్మి, ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు రాలేదు. పోనీ.. దీనికి సంబంధించిన అభ్య‌ర్థ‌న‌ను కూడా కోర్టుకు స‌మ‌ర్పించ‌లేదు. దీంతో సీబీఐ కోర్టు న్యాయ‌మూర్తి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలోనే ఐఏఎస్ శ్రీల‌క్ష్మికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేశారు. వారెంట్‌ను ఈ నెల 30లోగా అమలు చేయాలని అధికారుల‌ను ఆదేశించారు.

మ‌రోవైపు.. సీఎం జగన్‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయసాయిరెడ్డిలు త‌మ‌ను కేసుల నుంచి త‌ప్పించాలంటూ.. దాఖ‌లు చేసిన‌ డిశ్చార్జి పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ, ఈడీ గడువు కోరాయి. వాన్‌పిక్‌ కేసులో రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, రిటైర్డ్‌ ఐఆర్ఎస్‌ అధికారి బ్రహ్మానందరెడ్డి కూడా గురువారం జ‌రిగిన విచారణకు హాజరు కాలేదు. వీరిద్దరికీ గతంలో హైకోర్టు మినహాయింపు ఇచ్చినప్పటికీ వారు కానీ, వారి తరఫు న్యాయవాదులు ఖ‌చ్చితంగా హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు గైర్హాజరైతే తగిన ఉత్తర్వులిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

కానీ, వారు ఇద్ద‌రూ కూడా కోర్టు కు హాజ‌రు కాలేదు. మ‌రి దీనిపై ఎలాంటి ఉత్త‌ర్వులు ఇస్తుందో చూడాలి. అయితే.. కోర్టు స‌మ‌యం ముగియ‌డంతో విచార‌ణను శుక్ర‌వారానికి వాయిదా వేశారు. పెన్నా కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి జి. వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్‌ను సీబీఐ కోర్టు వెన‌క్కి తీసుకుంది. పెన్నా కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి జి. వెంకట్రామిరెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. దీంతో వెంకట్రామిరెడ్డిపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్‌ను సీబీఐ కోర్టు వెన‌క్కి తీసుకుంది.